Avatar 3 | జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో 2009లో విడుదలైన ‘అవతార్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ చరిత్రను తిరగరాసింది. పండోరా గ్రహం, అక్కడి జీవులు, వారి సంస్కృతి ప్రేక్షకులను ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లింది. ఆ విజయం తర్వాత 2022లో వచ్చిన ‘అవతార్ 2’ కూడా భారీ స్థాయిలో ఆదరణ పొందింది. అయితే తాజాగా విడుదలైన ‘అవతార్ 3’ మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. డిసెంబర్ 5న భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన ‘అవతార్ 3: ఫైర్ అండ్ ఆష్’ (Avatar: Fire and Ash) బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ ఫలితంతో ‘అవతార్’ ఫ్రాంచైజీ భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇప్పటికే ప్రకటించిన ‘అవతార్ 4’, ‘అవతార్ 5’ సినిమాలపై నిలిపివేయాలని ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు జేమ్స్ కామెరాన్ వెల్లడించడం ఇప్పుడు హాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎంటర్టైన్మెంట్ వీక్లీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో జేమ్స్ కామెరాన్ మాట్లాడుతూ, “ఏ సినిమా అయినా, ఏ ఫ్రాంచైజీ అయినా ముందుకు సాగాలంటే కమర్షియల్ సక్సెస్ చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ‘అవతార్’ ఫ్రాంచైజీ కొనసాగుతుందో లేదో చెప్పలేను. అవతార్ 3 సరైన ఫలితం ఇవ్వకపోతే, అవతార్ 4, 5 తీసే అర్థం ఉండదు. బిజినెస్‌ని బట్టే ఫ్రాంచైజీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది” అని స్పష్టం చేశారు. అంతేకాదు, త్వరలోనే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ‘అవతార్’ సిరీస్ భవిష్యత్తుపై స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు.
“అవతార్ ప్రపంచంలో ఇంకా చెప్పాల్సిన కథ చాలా ఉంది. ఎన్నో కొత్త పాత్రలను పరిచయం చేయాల్సి ఉంది. ఈ ఫ్రాంచైజీపై నాకు అపారమైన ప్రేమ ఉంది. ఇప్పటివరకు వాడినదానికంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించాం. కానీ ముందుకు వెళ్లాలంటే భారీ బడ్జెట్ అవసరం. బిజినెస్ సరిగా లేకపోతే, మేము అనుకున్నట్టుగా అన్నీ జరగవు. ప్రపంచం మారిపోయింది, లెక్కలు మారిపోయాయి. ఈ ఏడాది మాకు పెద్దగా కలిసి రాలేదు” అని కామెరాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ‘అవతార్’ అభిమానుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉన్న ఈ ఫ్రాంచైజీకి, ‘అవతార్ 3’ ఫలితం పెద్ద షాక్‌గా మారింది. ఇక జేమ్స్ కామెరాన్ ప్రకటించబోయే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఇప్పుడు సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.