Avatar 3 | హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ 3 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవతార్ మొదటి రెండు భాగాలు విశేష ఆదరణ పొందిన నేపథ్యంలో అవతార్ 3 కూడా తప్పక ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని విశ్వసిస్తున్నారు. అవతార్: ఫైర్ అండ్ యాష్ టైటిల్‌తో మూడో భాగం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ చిత్రం డిసెంబరు 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అవతార్ 3 ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. జేమ్స్ కామెరూన్ విజువల్ మాయాజాలం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ట్రైలర్లో కొత్త అగ్ని నెవీ తెగలు, పాండోరా మళ్ళీ ఎదుర్కొంటున్న మానవ ముప్పు, కొత్త ఎమోషనల్ కోణాలని చాలా అద్భుతంగా చూపించారు. ప్రస్తుతం ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. కొద్ది రోజుల క్రితం మూవీ విలన్ పాత్రగా పరిచయం కాబోతున్న ‘వరంగ్’ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. అగ్ని శక్తులతో కూడిన నెవీ గణానికి చెందిన వరంగ్ పాత్ర చాలా మిస్టీరియస్‌గా, ఇంటెన్స్‌గా ఉండబోతున్నట్లు సినీ ప్రియులు భావించారు. ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పార్ట్‌లో కొత్త విలన్లు తెరపైకి రానున్నారు.
ఇప్పటికే మానవ ప్రపంచంతో జేక్ ఫ్యామిలీ రెండుసార్లు పోరాడింది. కానీ ఈసారి ‘యాష్ వరల్డ్’ లోని తెగలతో తలపడాల్సి వస్తుంది. పాండోరాలోని భిన్న భిన్న జీవన శైలుల మధ్య విభేదాలు, పోరాటాల్ని ఈసారి చూపించనున్నారని ఆయన తెలిపారు. ‘అవతార్’ మొదటి భాగం భూమితో, రెండో భాగం నీటితో ముడిపడిన కథలుగా సాగితే… మూడో భాగం అగ్నిని నేపథ్యంగా తీసుకుంది. పాండోరా చంద్రునిపై జరిగే యుద్ధం, అగ్నికీళ్ళు, కొత్త తెగల పోరాటాలు… ఇవన్నీ ఈ సినిమా ప్రధానాకర్షణగా నిలవనున్నాయి . జేమ్స్ కామెరూన్ తనదైన శైలిలో టెక్నాలజీని వినియోగిస్తూ సినిమా నిర్మాణం జరుపుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా, భారీ స్థాయిలో 160కి పైగా భాషల్లో విడుదల కానుంది. చిత్ర బృందం వెల్లడించిన వివరాల ప్రకారం, ‘అవతార్ 4’ ను 2029లో, ‘అవతార్ 5’ ను 2031 డిసెంబరులో విడుదల చేయనున్నారు. ఈ రెండు భాగాలు కూడా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా, కథాపరంగా ప్రేక్షకులను మరోసారి అబ్బురపరిచేలా ఉంటాయని దర్శకుడు తెలిపాడు.