Avatar 3 | హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్ – ఫైర్ అండ్ యాష్’ (Avatar 3) డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విజువల్ వండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘అవతార్’ ఫ్రాంచైజీలో ఇది మూడో భాగం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌కి చేరాయి. ఈ నేపథ్యంలో థియేటర్ ఓనర్లకు జేమ్స్ కామెరూన్ కీలక సూచనలు జారీ చేశారు. సినిమా ప్రదర్శనలో ఎలాంటి కట్లు, అంతరాయాలు లేకుండా పూర్తి స్థాయిలో చూపించాలని, ముఖ్యంగా విజువల్, సౌండ్ క్వాలిటీ విషయంలో రాజీ పడవద్దని ఆయన స్పష్టం చేశారు. మూడు గంటల పదిహేడు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు సంపూర్ణ అనుభూతితో ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ‘అవతార్-3’ రిలీజ్‌తో పాటు మరో ఆసక్తికర అంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ప్రదర్శన సమయంలో పలు అంతర్జాతీయ, భారతీయ భారీ ప్రాజెక్టుల ట్రైలర్లను కూడా థియేటర్లలో చూపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’ న్యూ ట్రైలర్‌ను ‘అవతార్-3’తో పాటు ప్రదర్శించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్’కు ప్రేరణ భారతీయ ఇతిహాసమైన రామాయణమేనని కొంతమంది విశ్లేషకులు ఎప్పటి నుంచో అభిప్రాయపడుతున్నారు. ధర్మం కోసం పోరాడే వీరుడిగా శ్రీరాముడి పాత్రను, ప్రకృతితో మమేకమై న్యాయపోరాటం చేసే ‘అవతార్’ కథతో పోలుస్తున్నారు. అంతేకాదు, అవతార్ పాత్రల నీలిరంగు రూపం కూడా శ్రీరాముడి రూపాన్ని గుర్తుకు తెస్తుందని భారతీయ సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘అవతార్-3’ షోల్లో ‘రామాయణ’ ట్రైలర్ ప్రదర్శనకు మరింత ఆసక్తి నెలకొంది.
భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ‘రామాయణ’ రూపొందుతోంది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, నితేశ్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నట్లు సమాచారం. ఈ రెండు భాగాల కోసం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమలో ఇది సంచలనంగా మారింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు పబ్లిసిటీ కూడా అదే స్థాయిలో ఉండేలా మేకర్స్ వ్యూహం రచిస్తున్నారని, అందులో భాగంగానే ‘అవతార్-3’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌తో ట్రైలర్‌ను జతచేస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’ కొత్త ట్రైలర్ కూడా ‘అవతార్-3’ షోల్లో ప్రదర్శించే అవకాశం ఉందని సమాచారం. అలాగే హాలీవుడ్ అభిమానులకు అదనపు ట్రీట్‌గా ‘అవెంజర్స్ – డూమ్స్ డే’, క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కిస్తున్న ‘ఒడిస్సీ’ ట్రైలర్లు కూడా ఈ షోల్లో కనిపించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి డిసెంబర్ 19న థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు ‘అవతార్-3’ ఒక్క సినిమాతోనే కాకుండా ట్రైలర్ ఫీస్ట్‌తో ఫుల్ ఫిదా చేయనున్నారు.