Avatar 2 Record | అవతార్ 2 సినిమా కొత్త రికార్డులను సొంతం చేసుకుంటున్నది. ఇండియాలో విడుదలైన 15 వ రోజులకే రూ.300 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు మొత్తం రూ.316.75 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు సినిమా మార్కెట్ వర్గాల సమాచారం. రానున్న వారం రోజుల్లో మరో కొత్త రికార్డును కూడా బద్దలు కొట్టనున్నది.
ఎవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమా ఇండియాలో రూ.373.22 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. రానున్న వారంలో ఎవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును అవతార్ 2 బద్దలు కొట్టడంతోపాటు భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాలలో ది జంగిల్ బుక్, ది లయన్ కింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ రూ.227.46 కోట్లు, ది జంగిల్ బుక్ సినిమా రూ.188 కోట్లు, ది లయన్ కింగ్ సినిమా రూ.158.71 కోట్ల కలెక్షన్లను రాబట్టాయి.
కాగా, అవతార్ 2 ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలను కూడా దాటేసింది. బ్రహ్మాస్త్ర సినిమాకు రూ.254 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కాగా, కశ్మీరీ ఫైల్స్ రూ.247 కోట్లు, దృశ్యం 2 రూ.229.54 కోట్లు, భూల్ భులయ్యా రూ.181.75 కోట్లు, గంగాబాయి కతియావాడి రూ.126.50 కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. డిసెంబర్ 16 న మన దేశంలో రిలీజ్ అయిన అవతార్ 2 సినిమా.. దాదాపు రూ.2 వేల కోట్లతో తెరకెక్కించినట్లు సమాచారం. ఈ సినిమాను మన దేశంలో ఇంగ్లిష్, హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల చేశారు.