బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ జీవిత విశేషాలతో ఓ పుస్తకం వెలువడనుంది. ‘బచ్చన్స్’ పేరుతో ఈ పుస్తకాన్ని రచయిత ఎస్ఎంఎం ఔసజ రచిస్తున్నారు. ఈ పుస్తకంలో మూడు తరాల అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు సాధించిన విజయాలు, వృత్తిపర, వ్యక్తిగత వివరాలను చేర్చనున్నారు. అమితాబ్, అతని కుటుంబ సభ్యుల గురించి తెలియని విషయాలు, చూడని ఫొటోలతో సమగ్రంగా పుస్తకాన్నితయారు చేస్తున్నట్లు రచయిత ఔసజ తెలిపారు. రచయితగా అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కీర్తి, నటుడిగా అమితాబ్ సృష్టించిన చరిత్ర, హీరో హీరోయిన్లుగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ సాధించిన విజయాలూ..వంటి విశేషాలన్నీ ‘బచ్చన్స్’ పుస్తకంలో చోటు చేసుకుంటాయని ఔసజ చెబుతున్నారు. రచయిత ఔసజ మాట్లాడుతూ…‘అమితాబ్ బచ్చన్ నట, జీవిత విశేషాల గురించి పుస్తకాలు వచ్చాయి. ఇది మిగతా వాటితో చూస్తే ప్రత్యేకమైనదని చెప్పగలను. కొన్నేళ్లుగా సేకరించిన ఫొటోలు, సమాచారం పుస్తకంలో పొందుపర్చాను. మూడు తరాలుగా బచ్చన్ కుటుంబ సభ్యులు సాధించిన విజయాలు, విశేషాలు ఉంటాయి’ అని తెలిపారు.