‘కార్చిచ్చు మీద ఎంత వాన పడినా అది ఆగదు. పవన్‌కల్యాణ్‌గారు కూడా అలాంటివారే. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతుంటారు. ఆయనతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి చాలా శ్రద్ధతో పనిచేశాను’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి. బుధవారం హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘హరిహరవీరమల్లు’ చిత్రం నుంచి ‘అసుర హననం’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌ను అందరూ పవర్‌స్టార్ అంటారని, తాను మాత్రం మూర్తీభవించిన ధర్మాగ్రహమని అభివర్ణిస్తానని, సమాజ శ్రేయస్సు కోసం ఆయన ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తారని కీరవాణి అన్నారు.
నిర్మాత ఎ.ఎం.రత్నంకు ఇండస్ట్రీలో వివాదరహితుడిగా పేరుందని, ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని సాధించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర సమర్పకుడు ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ ‘సినీరంగంలో 54ఏళ్ల ప్రయాణం నాది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పెద్ద సినిమాలు చేశా. అందులో 90శాతం విజయాలే. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’ అన్నారు. పవన్‌కల్యాణ్‌ను డైరెక్ట్ చేయడం అంటే ఓ అవార్డు గెలుచుకున్నంత ఆనందంగా ఉందని, ఓ గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే తపనతో పనిచేశానని, కత్తికి, ధర్మానికి మధ్య జరిగే యుద్ధమే ఈ కథ అని చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ తెలిపారు. ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న విడుదలకానుంది.