A Teacher’s Gift | మెక్సికోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 41వ గ్వాడలజరా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్(41st Guadalajara International Film Festival)లో అస్సాంకు చెందిన నటుడు మరియు రచయిత రాజ్దీప్ చౌదరి రూపొందించిన ‘ఏ టీచర్స్ గిఫ్ట్’ (A Teacher’s Gift) చిత్రం ప్రదర్శితమై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. అస్సాంలోని సిల్చార్కు చెందిన రాజ్దీప్ చౌదరి ఈ చిత్రంలో నటించడమే కాకుండా కథను కూడా అందించడం విశేషం. ఏప్రిల్ 24న ప్రదర్శితమైన ఈ చిత్రం, ఈ ఫెస్టివల్లోని ప్రతిష్టాత్మక ‘ప్రెమియో మాగీ’ విభాగంలో పోటీకి ఎంపికైంది.
పోర్చుగీస్ దర్శకుడు అర్తూర్ రిబీరో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని బ్రిటన్కు చెందిన ఎరిక్ ఒల్లెరెన్షా నిర్మించారు. మనుషుల మధ్య సంబంధాలు మరియు భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అంజలి పాటిల్(నా బంగారు తల్లి), ధృవ్ సెహగల్ మరియు వరుణ్ బుద్ధదేవ్ వంటి ప్రముఖ భారతీయ నటులు కీలక పాత్రలు పోషించారు. గతంలో ‘జాక్ & దిల్’, ‘మిస్టర్ మమ్మీ’ వంటి హిందీ చిత్రాల్లో నటించిన రాజ్దీప్, తన సొంత కథతో అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా రాసుకున్న ఈ కథ మెక్సికో వంటి భిన్న సంస్కృతులు గల దేశంలో ప్రదర్శితం కావడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం ఇప్పటికే బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్ (BIFA 2026) పరిశీలనకు కూడా ఎంపికై భారతీయ సినిమా ఖ్యాతిని చాటుతోంది.