Asian Chief Sunil Narang | టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కుబేరా’ (Kuberaa). ఈ మల్టీ లింగ్వెల్ ప్రాజెక్ట్‌లో తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే నిర్మాత సునీల్ నారంగ్ కూడా ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు. అయితే ఈ సినిమా ఓటీటీ డీల్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు సునీల్.
ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో భారీ మొత్తంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా డీల్ చేసుకున్న ప్రకారం.. జూన్ 20 లోపే కుబేర విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రోడక్షన్ పనులు ఆలస్యం అవ్వటంతో 2 వారాలు సినిమాను విడుదల వాయిదా వేసి.. అలాగే ఓటీటీ డేట్‌ని కూడా ముందుకి జరుపుదాం అని ప్రైమ్ వీడియో నిర్వహాకులను చిత్రయూనిట్ సంప్రదించింది. అయితే ఈ విషయంలో ప్రైమ్ వీడియో ఒప్పుకోకపోగా.. విడుదల లేట్ అయితే రూ.10 కోట్లు కట్ చేస్తామని చిత్రబృందానికి చెప్పినట్లు నిర్మాత తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.