శనివారం 29 ఫిబ్రవరి 2020
అశ్వథ్థామ మూవీ రివ్యూ

అశ్వథ్థామ మూవీ రివ్యూ

Jan 31, 2020 , 13:54:03
PRINT
అశ్వథ్థామ మూవీ రివ్యూ

రివ్యూ: అశ్వథ్థామ

తారాగణం: నాగశౌర్య, మెహరీన్‌, సర్గుణ్‌కౌర్‌, జిషూసేన్‌ గుప్తా

సినిమాటోగ్రఫీ: మనోజ్‌ రెడ్డి

ఎడిటర్‌: గ్యారీ బి హెచ్‌

సంగీతం: శ్రీచరణ్‌ పాకాల

కథ: నాగశౌర్య

సంభాషణలు: పరశురాం శ్రీనివాస్‌

కథ: నాగశౌర్య

నిర్మాత: ఉషా ముల్పూరి

నిర్మాణ సంస్థ: ఐరా క్రియేషన్స్‌

దర్శకత్వం: రమణతేజ


కెరీర్‌ ఆరంభం నుంచి వినూత్న కథా చిత్రాల్ని ఎంచుకుంటూ యువ హీరోల్లో తనదైన  ప్రత్యేకతను చాటుకుంటున్నారు నాగశౌర్య. ఇప్పటి వరకు ఆయన ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లోనే నటించారు. తొలిసారిగా తన పంథాకు భిన్నంగా నాగశౌర్య క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అశ్వథ్థామ’ చిత్రంలో నటించారు. ఈ సినిమాకు ఆయనే కథను అందించడం విశేషం. కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో తాను ఈ కథను తయారుచేసుకున్నానని, నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టే విషయంలో జాగరూకతను పెంచే చిత్రమిదని ప్రచార సందర్భంలో చెప్పారు నాగశౌర్య. ఈ నేపథ్యంలో ప్రేక్షకులముందుకొచ్చిన ‘అశ్వథ్థామ’ ప్రేక్షకుల్ని ఎంత మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..

కథేమిటంటే..

గణ (నాగశౌర్య) చెల్లెలు ప్రియాకు (సర్గుణ్‌కౌర్‌) నిశ్చితార్థం జరుగుతుంది. కుటుంబమంతా పెళ్లి ఏర్పాట్లలో ఉండగా ప్రియ ఆత్మహత్యకు యత్నిస్తుంది. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకొని అందుకుగల కారణమేంటో తెలుసుకుంటాడు గణ. తాను గర్భవతిననే షాకింగ్‌ నిజాన్ని వెల్లడిస్తుంది ప్రియ. అయితే అందుకు ఎవరు కారణమో తనకు తెలియదని చెబుతుంది. ఈలోగా విశాఖపట్నం నగరంలో చాలా మంది అమ్మాయిల మిస్సింగ్‌ కేసులు నమోదు అవుతుంటాయి. వాటి గురించి శోధిస్తాడు గణ. అమ్మాయిలందరూ తమకు తెలియకుండానే అత్యాచారానికి గురి కాబడుతున్నారని తెలుసుకుంటాడు. దీని వెనకున్న ముఠాను కనిపెట్టడానికి గణ ప్రయత్నాలు తీవ్రం చేస్తాడు. ఈ క్రమంలో అతనికి తెలిసిన నిజాలేమిటి? ఆ ఆకృత్యాలకు అసలు సూత్రధారి ఎవరు? చివరకు గణ మిస్టరీని ఛేదించాడా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మిగతా చిత్ర కథ..


కథా విశ్లేషణ..

చెల్లెలిని ప్రాణంగా ప్రేమించే అన్నయ్య ఆమెకు జరిగిన అన్యాయాన్ని శోధించే క్రమంలో తెలుసుకున్న నిజాలు...దుష్టశిక్షణ ఎలా చేశాడన్నదే ‘అశ్వథ్థామ’లోని మెయిన్‌ పాయింట్‌. ఈ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌కు సిస్టర్‌ సెంటిమెంట్‌తో చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను తయారుచేసుకున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ జోలికి వెళ్లకుండా ఓ ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌ కథను అందించడంపైనే దృష్టి పెట్టారు. అమ్మాయిల కిడ్నాప్‌, అత్యాచారాలకు కారకులెవరో తెలుసుకునే ప్రయత్నంలో గణ చేసే ఇన్వెస్టిగేషన్‌ ప్రథమార్థంలో ఉత్కంఠను పంచింది. ఒక్కొక్క సాక్ష్యాన్ని సేకరిస్తూ గణ నిందితుల్ని వేటాడే సన్నివేశాలు చక్కటి థ్రిల్‌ని పంచాయి. అమ్మాయిలను కిడ్నాప్‌ చేసే జాలరులు వారిని అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి చేర్చుతుంటారు. ఈ క్రైమ్‌ను  ఛేదించడానికి గణ చేసే అంబులెన్స్‌ ఛేజ్‌ హైలైట్‌గా అనిపిస్తుంది. అయితే ప్రథమార్థంలోనే ప్రతినాయకుడెవరో తెలిసిపోవడంతో ద్వితీయార్థంలో ఉత్కంఠ కాస్త మిస్‌ అయిన భావన కలుగుతుంది.

తన గర్ల్‌ఫ్రెండ్‌ నేహా (మెహరీన్‌) స్నేహితురాలైన ఓ అమ్మాయి కిడ్నాప్‌ గురవడం..ఆమె హత్యతో ప్రతినాయకుడెవవరో తెలుసుకుంటాడు గణ. అక్కడి నుంచి కథాగమనం మొత్త ఊహించినట్లుగానే సాగింది.  సీరియల్‌ రేప్‌, మర్డర్‌ అంశాలతో ఓ సైకోపాత్‌ ప్రతినాయకుడిగా దర్శకుడు ఈ కథను ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశారు. కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా సమాజంలో జరుగుతున్న బర్నింగ్‌ ఇష్యూను చర్చించడం ఆలోచింపజేసేలా అనిపిస్తుంది. సినిమా ఓపెనింగ్‌లో లో అన్నాచెల్లెళ్ల బంధాన్ని తెలియజెప్పే సీన్‌ హార్ట్‌ టచింగ్‌గా ఉంది.

ప్రతినాయకుడి పాత్ర చిత్రణ, సైకో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ థ్రిల్‌ను పంచాయి.  క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమైనా ఎలాంటి మలుపులు లేకుండా స్ట్రెయిట్‌ స్క్రీన్‌ప్లేతో కథను చెప్పే ప్రయత్నం చేశారు. సైకోపాత్‌ విలన్‌ చేసే చేష్టలు హింసాత్మకంగా ఉంటూ గగుర్పాటుకు గురి చేశాయి. క్లైమాక్స్‌ ఎపిసోడ్‌లో ఏమాత్రం ఉత్కంఠకు తావులేకుండా ప్రేక్షకులు ఊహించినట్లుగానే సింపుల్‌గా ముగించారు. అంతటి బలమైన సైకోపాత్‌ను కథానాయకుడు సులువుగా ఆటకట్టించడం కన్విన్సింగ్‌గా అనిపించలేదు.  థ్రిల్లర్‌ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు‘అశ్వథ్థామ’ నచ్చుతుంది. 

నటీనటుల పనితీరు..

హీరో నాగశౌర్య యాక్షన్‌, సీరియస్‌ కథాంశాల్లో కూడా మెప్పించగలడని ఈ సినిమా నిరూపించింది. లవర్‌బాయ్‌ ఇమేజ్‌ను ఉన్న ఆయన ఈ సినిమాలో యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌లో చక్కటి నటనను కనబరిచాడు. కథా రచయితగా కూడా ఆయనకు మంచి మార్కులు పడతాయి. ఇక సైకోపాత్‌ విలన్‌గా జిషుసేన్‌ గుప్తా నటన ఆకట్టుకుంటుంది. కథానాయిక మెహరీన్‌ పరిమితమైన పాత్రలో  కనిపించింది. ఆమె పాత్రకు ఎక్కువగా స్కోప్‌లేకుండా పోయింది. హీరో చెల్లెలు పాత్రలో సర్గుణ్‌ మంచి అభినయానికి కనబరచింది. ప్రిన్స్‌, పోసాని, సత్య..ఇతరులు తమ పాత్రల్లో ఫర్వాలేదనిపించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం ఫర్వాలేదనిపించింది. జిబ్రాన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా కుదిరింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశానికి ఫ్యామిలీ సెంటిమెంట్‌ జోడించి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు రమణతేజ. కొన్ని సన్నివేశాల్లో ఆయన పనితనం మెప్పిస్తుంది. ఐరా క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు..

హీరో నాగశౌర్యను మునుపటి కంటే భిన్నంగా కొత్త పంథాలో ఆవిష్కరించిన చిత్రంగా ‘అశ్వథ్థామ’ను చెప్పొచ్చు. కథలో కొత్తదనం లేకపోయినా  క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌ను ఇష్టపడే ప్రేక్షకుల్ని మెప్పిస్తుందీ చిత్రం.

రేటింగ్‌: 2.75/5


logo