ఆశిష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సెల్ఫిష్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. విశాల్ కాశీ దర్శకుడు. ఇవానా కథానాయిక. సోమవారం హీరో ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘దిల్ ఖుష్’ అనే పాటను విడుదల చేశారు. మిక్కి జే మేయర్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా జావెద్ అలీ పాడారు. దర్శకుడు విశాల్ కాశీ మాట్లాడుతూ…‘మాస్ ప్రేమ కథా చిత్రమిది. హీరో క్యారెక్టర్ సెల్ఫిష్గా ఉంటుంది. ఈ అమ్మాయి నాది అని ముందే చెప్పుకుంటాడు హీరో. ఈ పాట ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది’ అన్నారు.
హీరో ఆశిష్ మాట్లాడుతూ..‘ఒక మంచి పాటతో నా పుట్టినరోజు జరుపుకోవడం ప్రత్యేకంగా ఉంది. ఈ సినిమా దర్శకుడు కాశీకి, నాకు చాలా కీలకం. మమ్మల్ని మేము నిరూపించుకోవాలి. అందుకోసం చాలా కష్టపడ్డాం’ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘19 ఏండ్ల తర్వాత సుకుమార్, నేను కలిసి పనిచేస్తున్నాం. ధూల్ పేట నేపథ్యంగా సాగే మాస్ ప్రేమ కథ ఇది. ఈ ఒక్క పాటకు మిక్కీ మ్యూజిక్ చేశాడు. రెండు పాటలు అనూప్ స్వరపర్చాడు. మరో రెండు పాటలకు వేర్వేరు సంగీత దర్శకులను తీసుకుందామని అనుకుంటున్నాం. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని పట్టుదలగా ఉన్నాం’ అన్నారు.