Ashika Ranganath | టాలీవుడ్ నటి ఆషికా రంగనాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మేనమామ కూతురు అచల్ (22) నవంబర్ 22న ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరబోతున్న అచల్, తన దూరపు బంధువు మయాంక్‌తో ప్రేమలో పడింది. మయాంక్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అప్పటివరకు లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చాడని కుటుంబం పేర్కొంది. ఆమె నిరాకరించిన ప్రతీసారీ అతడు శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ఫిర్యాదులో తెలిపారు. మయాంక్ మాదకద్రవ్యాలకు బానిసగా ఉండడమే కాక, పలువురు యువతులతో అనైతిక సంబంధాలున్నాయని విషయం అచల్‌కు తెలిసిన తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురైందని కుటుంబసభ్యులు తెలిపారు.
తనపై కొనసాగుతున్న వేధింపులకు తట్టుకోలేక అచల్ బంధువుల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటన జరిగిన 10 రోజులు అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు అచల్ మయాంక్‌కు పంపిన చివరి మెసేజ్ హృదయ విదారకం. నా జీవితంలో నువ్వు లేకుండా నేను జీవించలేను. నువ్వు నన్ను మోసం చేసినప్పటికీ నేను నిన్ను మర్చిపోలేను. నువ్వు నా కలలను చెడగొట్టావు. ద్రోహం చేయలేదని ప్రమాణం చేయి. నువ్వు చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోవాలి” అంటూ ఆమె సందేశం పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన నంబర్‌ను బ్లాక్ చేయవద్దని కూడా వేడుకుంది
అచల్ తల్లిదండ్రులు మయాంక్ మరియు అతడి తల్లి మైనాపై పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్లో అధికారిక ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెకు న్యాయం జరగాలంటే నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనతో ఆషికా రంగనాథ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కన్నడ నాయిక అయిన ఆషికా రంగనాథ్ అమిగోస్, నా సామిరంగ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కాబోతుంది. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో హీరోయిన్గా నటిస్తోంది.