Ramayana | బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’ నుంచి తాజాగా మేకర్స్ మరో ఆసక్తికర అప్డేట్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అయోధ్య రాజు దశరథుడిగా నటిస్తున్న సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ పోస్టర్ను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. గతంలో రామానంద్ సాగర్ తెరకెక్కించిన ఐకానిక్ టీవీ సీరియల్ ‘రామాయణ్’లో రాముడి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ గోవిల్, దశాబ్దాల తర్వాత మళ్లీ అదే రామాయణ కథలోకి రావడం విశేషం.
ఒకప్పుడు ఒక తరానికి రాముడిని పరిచయం చేసిన ఆయన, ఇప్పుడు అయోధ్య రాజుగా రామాయణ ప్రపంచంలోకి తిరిగి వస్తున్నారు. దశరథుడిగా అరుణ్ గోవిల్ అంటూ చిత్రబృందం రాసుకొచ్చింది. ఈ పోస్టర్లో 68 ఏళ్ల అరుణ్ గోవిల్ రాజసంగా అయోధ్య సింహాసనంపై కూర్చున్నట్లుగా కనిపించారు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, అరుణ్ గోవిల్ కీలకమైన దశరథ మహారాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మొదటి భాగం నవంబర్ 6, 2026న దీపావళి కానుకగా విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఐమ్యాక్స్ ఫార్మాట్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.