Arshad Warsi | ఇటీవలే ‘జాలీ ఎల్ఎల్బీ 3’తో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్షద్ వార్సి, ఇప్పుడు సరికొత్త సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ (Pritam and Pedro) వెబ్ సిరీస్ అధికారిక ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్లో డిజిటల్ ప్రపంచంలో జరిగే సైబర్ క్రైమ్, కిడ్నాప్ కేసు చుట్టూ తిరుగుతూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక హ్యాకర్ మధ్య కుదిరిన వింతైన భాగస్వామ్యం, వారిద్దరూ కలిసి చేసే ప్రమాదకరమైన సైబర్ ఛేజింగ్, దీనికి తోడు కామెడీ, సస్పెన్స్, మిస్టరీ కలబోతగా ఈ సిరీస్ రూపొందింది.
ఈ సిరీస్‌లో అర్షద్ వార్సి ఒక క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ ‘పెడ్రో’ పాత్రను పోషించారు. పనిష్మెంట్ ట్రాన్స్‌ఫర్‌పై సైబర్ సెల్‌కు వచ్చిన ఆయన, అక్కడ ఒక మినిస్టర్ కొడుకును రక్షించే క్రమంలో ‘ప్రీతమ్’ అనే యంగ్ హ్యాకర్‌తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ ప్రీతమ్ పాత్రలో ప్రముఖ స్టార్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ కుమారుడు ‘వీర్ హిరాణీ’ నటుడిగా బాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. గతంలో ‘మున్నాభాయ్ MBBS’ క్లైమాక్స్‌లో సర్క్యూట్ కొడుకుగా కాసేపు మెరిసిన వీర్, ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. కాగా, ఈ ఇద్దరినీ ముప్పతిప్పలు పెట్టే ప్రమాదకరమైన సైబర్ క్రిమినల్ పాత్రలో నటుడు విక్రాంత్ మాస్సే కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు అవినాష్ అరుణ్ తెరకెక్కించిన ఈ సిరీస్‌ను రాజ్‌కుమార్ హిరాణీ క్రియేటర్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.