హీరో విశ్వక్సేన్కు సినిమా పట్ల కమిట్మెంట్ లేదని ఆరోపించారు నటుడు అర్జున్ సర్జా. విశ్వక్ హీరోగా మూడు నెలల కిందట ఓ చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వంలో ప్రారంభించారు అర్జున్. ఈ చిత్రంలో ఆయన కూతురు ఐశ్వర్య నాయికగా నటిస్తున్నది. ఎప్పటికప్పుడు షూటింగ్‌కు వస్తానని చెబుతూనే విశ్వక్ సేన్ రాలేదని, ఇది తనను, యూనిట్ సభ్యులను అవమానించడమేనని అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై హైదరాబాద్ ఫిలింఛాంబర్లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.అర్జున్ మాట్లాడుతూ ‘విశ్వక్సేన్ హీరోగా మూడు నెలల కిందట ఓ చిత్రాన్ని ప్రారంభించాను. ముందు పారితోషికం నిర్ణయిస్తే, వద్దని ఏరియా రైట్స్ కావాలన్నారు. మేమూ సరేనన్నాం. సినిమా షూటింగ్ కోసం పలుమార్లు డేట్స్ ఫిక్స్ చేసుకున్నా, చివరి నిమిషంలో రాలేనని చెప్పేవారు. మొత్తం షూటింగ్ సిద్ధం చేసుకుని ఇలా రెండు మూడు సార్లు రద్దు చేసుకున్నాం.
ఈ నెల 3వ తేదీ నుంచి డేట్స్ ఇచ్చిన విశ్వక్ సేన్ ..మళ్లీ షూటింగ్‌కు రాలేనంటూ చెప్పాడు. ఒక సినిమాకు అంగీకారం కుదుర్చుకుంటే ఆ దర్శకుడికి, నిర్మాతకు గౌరవం ఇవ్వాలి, ఒప్పుకున్న ప్రాజెక్ట్ పట్ల అంకితభావంతో పనిచేయాలి. 42 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను. విశ్వక్సేన్ అన్‌ప్రొఫెషనల్ యాక్టర్. ఆయనకు తన సినిమాల మీద గౌరవం లేదు. కథ నచ్చకుంటే, ప్రాజెక్ట్ ఇష్టం లేకుంటే ముందే చెప్పాలి. అలా షూటింగ్‌కు రెడీ అయ్యాక రాకుండా ఉంటే ఎలా? ఇక అతనితో నేను సినిమా చేయను. ఈ చిత్రాన్ని మరో హీరోతో తెరకెక్కిస్తా’ అని అన్నారు.