యువ కథానాయకుడు విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’(Arjun Chakravarthy) శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రానికి విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలకి ముందే 46 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. విజయ రామరాజుతో పాటు సిజా రోజ్, హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్ వంటి ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది చూసుకుంటే.
కథ
ఈ సినిమా కథ 1980 నుంచి 1996 మధ్య కాలంలో జరుగుతుంది. అనాథ అయిన అర్జున్ చక్రవర్తి (విజయ రామరాజు)ని మాజీ కబడ్డీ ప్లేయర్ రంగయ్య (దయానంద్ రెడ్డి) దత్తత తీసుకుని పెంచుకుంటాడు. వీరిద్దరి మధ్య ఉండే అనుబంధం ఈ సినిమాకి ప్రధాన బలం. రంగయ్య స్ఫూర్తితో అర్జున్ కూడా కబడ్డీని తన జీవితంగా మార్చుకుంటాడు. ఇండియన్ నేషనల్ టీమ్‌కి ఆడాలన్నదే అతని కల. జిల్లా స్థాయి పోటీల్లో దేవకి (సిజా రోజ్)తో పరిచయం, ప్రేమలో పడటం, ఆ తర్వాత ఆమెకు పెళ్లి జరగడంతో అర్జున్ తీవ్ర నిరాశకు గురవుతాడు. అయినప్పటికీ, తన మామ రంగయ్యను చూసి మళ్లీ ఆటపై దృష్టి పెట్టి జాతీయ స్థాయికి చేరుకుంటాడు. నేషనల్ టీమ్ తరపున ఆడి విజయం సాధించి తిరిగి వచ్చిన తర్వాత కబడ్డీ కోచింగ్ సెంటర్ పెట్టాలనుకుంటాడు. కానీ, ప్రభుత్వ అధికారుల అవినీతి, డబ్బులు, భూములు రాకపోవడం, కన్న తండ్రిలా చూసుకున్న రంగయ్య మరణంతో అర్జున్ ఒంటరిగా మారి తాగుడుకు బానిసవుతాడు. ఈ తరుణంలోనే కోచ్ కులకర్ణి (అజయ్) అతన్ని వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ ఆడమని కోరుతాడు. మరి అర్జున్ తిరిగి కబడ్డీ కోర్టులోకి అడుగుపెడతాడా? తన లక్ష్యాన్ని సాధిస్తాడా? దేవకి మళ్లీ అతని జీవితంలోకి వస్తుందా? అనేది వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
మన తెలుగులో స్పోర్ట్స్ డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. జెర్సీ తర్వాత అలాంటి ఒక భావోద్వేగభరితమైన కథతో వచ్చిన సినిమా ఇది. నల్గొండకు చెందిన ఒక మాజీ కబడ్డీ ప్లేయర్ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. మొదటి భాగం అర్జున్ కథ, ప్రేమకథ, జిల్లా, రాష్ట్ర స్థాయి గెలుపులతో సాగుతుంది. రివర్స్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
రెండో భాగం మాత్రం ఎమోషనల్‌గా నడుస్తుంది. రంగయ్యతో అనుబంధం, ప్రేమించిన అమ్మాయి దూరం కావడం, ప్రభుత్వ అధికారుల మోసం… ఈ సన్నివేశాలన్నీ ప్రేక్షకులను కదిలిస్తాయి. కొన్ని చోట్ల కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే, కబడ్డీ మ్యాచ్‌లు ఆకట్టుకున్నప్పటికీ, వాటిలో కొన్ని కంటిన్యూటీ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి.అయితే కబడ్డీ సీన్స్ సరిగ్గా లేకపోయిన ఎమోషన్‌తో ఆకట్టుకుంది ఈ మూవీ.
నటీనటులు
టైటిల్ రోల్ పోషించిన విజయ రామరాజు తన పాత్రలో జీవించారు. పాత్రలో వేరియేషన్స్ చూపించడానికి తన బాడీని మార్చుకోవడం, నటనలో చూపిన పరిణతి ప్రశంసనీయం. సిజా రోజ్ తన ప్రేమ కథతో క్యూట్‌గా కనిపించి ఆకట్టుకుంది. దయానంద్ రెడ్డి రెండు మూడు ఏజ్ వేరియేషన్స్‌లో చాలా అద్భుతంగా నటించి తన పాత్రకు ప్రాణం పోశారు. అజయ్ కోచ్ పాత్రలో పర్వాలేదనిపించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో బాగానే మెప్పించారు.
సాంకేతికంగా
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 80, 90ల నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. లోకేషన్స్ కోసం చిత్రబృందం బాగా కష్టపడినట్టు తెలుస్తోంది. కాస్ట్యూమ్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉండాల్సింది. కబడ్డీ మ్యాచ్‌లలో ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. పాటలు బాగున్నాయి, ముఖ్యంగా మెలోడీ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. దర్శకుడు ఒక వ్యక్తి జీవితం ఆధారంగా ఒక భావోద్వేగభరితమైన కథను బాగానే రాసుకున్నారు. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు. మొత్తంగా, ‘అర్జున్ చక్రవర్తి’ అనేది జీవితంలో, ఆటలో ఓడి గెలిచిన ఒక పోరాట యోధుడి కథ.