AR Rahman | సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన రెహ్మాన్, తొలిసారి పూర్తి స్థాయిలో నటుడిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. గతంలో కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో దర్శనమిచ్చినప్పటికీ, నటుడిగా పూర్తి స్థాయిలో కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తాజా కామెడీ చిత్రం ‘మూన్‌వాక్’లో ఏఆర్ రెహ్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రెహ్మాన్, తన పేరుతోనే ఉన్న ఓ మూవీ డైరెక్టర్ పాత్రలో కనిపించబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి మనోజ్ నిర్మల శ్రీధరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, “ఈ పాత్ర ఆలోచన వచ్చిన వెంటనే ప్రభుదేవాకు చెప్పాను. రెహ్మాన్ సార్‌కు ఇది పూర్తిగా కొత్త అనుభవమవుతుందని అనిపించింది. సరదాగా చేయమని అడిగితే, ఆయన ఎంతో ఆనందంగా ఒప్పుకున్నారు. తీవ్రమైన బిజీ షెడ్యూల్ మధ్య కూడా మా సినిమా కోసం సమయం కేటాయించారు” అని తెలిపారు.‘మూన్‌వాక్’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభుదేవా, ఏఆర్ రెహ్మాన్‌లతో పాటు యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ, అజు వర్గీస్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రెహ్మాన్‌ను నటుడిగా కొత్త అవతారంలో చూడబోతుండటంతో ఆయన అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇదిలా ఉండగా, సంగీత రంగంలో రెహ్మాన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. సంగీతం నుంచి నటన వరకు విస్తరిస్తున్న రెహ్మాన్ ప్రయాణం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.