తనదైన దారిలో వెళ్తూనే, తనకుతాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) చేసిన ప్రయత్నమే ‘ఘాటీ’. చాలామందికి తెలియని ఓ ప్రపంచాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు క్రిష్. ఉత్తరాంధ్రలో గంజాయిని, ఒకచోటు నుంచి మరొక చోటుకు తరలించే ఓ తెగ జీవన విధానాన్ని ఈ సినిమాలో చూపించనున్నారాయన. అనుష్కశెట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామాలో విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘దస్సోరా.. దస్సోరా.. హూ.. తూరుపు కనుమల నడుమింటి.. కారడవుల్లో కాలెట్టి.. సిరుతై ఉరికే యమ జట్టీ.. యాటకు కదిలే ఘాటీ..’ అంటూ ఘాటీల జీవన విధానానికి అద్దం పట్టేలా ఈఎస్ మూర్తి రాసిన ఈ పాటను సాగర్ నాగవెల్లి స్వరపరచగా, గీతా మాధురి, సాకేత్, శృతి రంజనీ ఆలపించారు. అనుష్క, విక్రమ్‌ప్రభు, ఇంకొందరు ఘాటీలు కలిసి గంజా సీక్రెట్‌గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ, పోలీసుల నుంచి తప్పించుకున్న సీన్స్ ఈ పాటలో కనిపిస్తున్నాయ్. వైవిధ్యమైన యాక్షన్ డ్రామా ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: మనోజ్‌రెడ్డి కాటసాని.