అగ్ర నటి అనుష్క కథానాయికగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ క్రైమ్ డ్రామా ‘ఘాటీ’. ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నెల 11న ‘ఘాటీ’ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ‘ఘాటీ’ టీమ్ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్ట్ కూడా పెట్టింది.
‘సినిమా ఒక జీవనది లాంటిది.. అది ప్రవహిస్తూవుంటుంది.. ‘ఘాటీ’ కేవలం సినిమా మాత్రమే కాదు. అది ఒక ప్రతిధ్వని.. ఒక అడవిగాలి.. మట్టి నుంచి పుట్టిన కథ.. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా రావాలనే తపనతో, అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాం.
ఈ నిరీక్షణ మీకెప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిని అందిస్తుందని మేం నమ్ముతున్నాం’ అంటూ ట్విటర్లో వారు పేర్కొన్నారు. ‘వేదం’ తర్వాత క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటిస్తున్న సినిమా ఇది. విక్రమ్‌ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు ఇందులో కీలక పాత్రలు పోషించారు. మాదకద్రవ్యాల మాఫియా నేపథ్యానికి ఓ బలమైన సామాజిక అంశాన్ని ముడిపెట్టి తీర్చిదిద్దిన కథ ఇది. వీఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగానే ఈ సినిమా వాయిదా పడ్డట్లు తెలుస్తున్నది.