మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘లాక్డౌన్’ ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది. ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా, తమిళనాడులో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు మరియు కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ‘ప్రతి నిరీక్షణ వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది’ అనే సందేశంతో ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.
ఈ చిత్రంలో అనుపమ ‘అనిత’ అనే మధ్యతరగతి యువతిగా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. కరోనా లాక్డౌన్ కాలంలో సామాన్యులు ఎదుర్కొన్న చేదు అనుభవాలు, ముఖ్యంగా ఒక యువతి ఒంటరిగా క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొంది అనే యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమాను మలిచారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, నాయికా ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రం అనుపమ కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.