OTT Platforms | ధూమపానం ఆరోగ్యానికి హానికరం. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఏటా ప్రాణాలు కోల్పోతున్నారు. అందరూ వీటికి దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సూచిస్తున్నది. థియేటర్లు, సినిమాల్లో ధూమపానం వ్యతిరేక ప్రకటన, కొన్ని సీన్లలో ‘ధూమపానం, మద్యపానం’ ఆరోగ్యానికి హానికరం’ అంటూ హెచ్చరికలు చూసే ఉంటారు. కానీ, ఇప్పటికీ చాలా మంది వీటిపై అవగాహన లేదు. నేడు ( మే 31) ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఓటీటీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ధూమపాన వ్యతిరేక హెచ్చరికలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు సూచించింది. పొగాకు ఉత్పత్తుల వినియోగం ‘ఆరోగ్యానికి హానికరం’ అని తప్పనిసరిగా ప్రదర్శించాలని చెప్పింది. యాంటీ-టొబాకో వార్నింగ్స్ ప్రదర్శనకు కొత్త నిబంధనలతో నోటిఫికేషన్‌ను బుధవారం జారీ చేసింది. ఆయా నిబంధనల అమలులో విఫలమైతే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించింది. ఇప్పటికే థియేటర్లలో ఈ తరహా నిబంధనలు అమల్లో ఉన్నాయి. తాజాగా ఓటీటీలకు వర్తింపజేసింది. టీవీ థియేటర్లలో ప్రోగ్రామ్ ప్రారంభానికి కనీసం 30 సెకన్ల ముందు పొగాకు వ్యతిరేక హెచ్చరిక ప్రకటన ప్రదర్శితమవుతుండగా.. ఓటీటీలకు తప్పనిసరిగా ఉండేది కాదు.
తాజా ఆదేశాలతో హాట్‌స్టార్ (Hotstar), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), సోనీ లివ్ (Sony Liv), నెట్‌ఫ్లిక్స్ (Netflix), జీ5 (Zee5) తదితర OTT ప్లాట్‌ఫారమ్‌లలో నిర్బంధంగా ప్రకటన ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. మైనర్లపై ఎక్కువ ప్రభావం పడే ఉంది. ఈ నేపథ్యంలో యాంటీ టొబాకో హెల్త్ వార్నింగ్‌తో కొంత మేర ప్రయోజనం ఉంటుందని, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తున్నది.