నజ్రియా ఫహాద్…చేసినవి తక్కువ చిత్రాలైనా దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రతిభగల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆమె తెరపైకి వస్తున్నది. నాని సరసన ఆమె నటిస్తున్న సినిమా ‘అంటే సుందరానికీ…’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించారు. ఈ నెల 10న విడుదలవుతున్నదీ సినిమా. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది నజ్రియా ఫహాద్.
స్టార్స్ కాదు కథే ముఖ్యం
నటిగా నాకు స్టార్స్ కంటే కథే ముఖ్యం. అందుకే నాకు కొందరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా నటించలేదు. కథల విషయంలో జాగ్రత్తగా ఉంటాను. నేను గతంలో నటించిన తరహా చిత్రాలే మళ్లీ మళ్లీ రావడం మొదలయ్యాయి. మూస పాత్రల్లో నటించడం వల్ల నటిగా నేను పొందే సంతోషం ఏమీ ఉండదు. ఇక విరామం కూడా కావాలని తీసుకున్నది కాదు. పెళ్లి త్వరగా అయ్యింది. ఫహాద్‌తో పెళ్లయ్యాక నాలుగేళ్లు తెరకు దూరమయ్యా. సినిమాలు చేయొచ్చు కదా అని ఆయన అడుగుతుంటారు. నా సహ నటీనటులను చూసినప్పుడు నాకూ నటించాలని అనిపించేది. అయితే నా కుటుంబం, ఇళ్లు చూసుకునేందుకు కొంత విరామం కావాలని అనిపించింది.
అంటే.. కథ బాగా నచ్చింది
ఈ సినిమా కోసం నాని ఫోన్ చేసి ముందు కథ విను, సమయం తీసుకో.. కానీ నటించనని అని చెప్పకు అన్నారు. దర్శకుడు వివేక్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. చూసిన వాళ్లందరూ సంతోషంగా తిరిగివెళ్లే చిత్రమిది. వినోదం, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఒక కథలో ఇవన్నీ కుదరడం అరుదు. ఇలాంటి చిత్రంలో నటించడం ఆనందంగా అనిపించింది. నేను ఈ సినిమాలో లీలా థామస్ అనే పాత్రలో నటించాను. లోపల బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉండే పాత్ర ఇది. నా నిజజీవితంతో చూస్తే ఇది భిన్నమైన పాత్ర. తోటి నటీనటులు బాగా నటిస్తే ఆ ప్రభావం మనపైనా పడుతుంది. నానితో కలిసి నటించడం వల్ల నేనూ నటనలో మెరుగయ్యా.
నాని స్నేహితుడు అయ్యాడు
నాని మంచి నటుడు. తనొక స్టార్ అనే ఫీలింగ్ చూపించడు. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో మేము స్నేహితులం అయ్యాము. నా గురించి జాగ్రత్త తీసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ నేను ఒప్పుకునేందుకు నాని ప్రయత్నమే కారణం. నరేష్, నదియా లాంటి సీనియర్స్‌తో నటించడం గొప్ప అనుభవాన్ని ఇచ్చింది.
డాన్సులు రావు
డాన్సుల్లో నేను వీక్. నాని బాగా డాన్స్ చేస్తారు. నన్ను ఉత్సాహపరిచేందుకు నేను ఎలా స్టెప్స్ వేసినా దర్శకుడు వివేక్, నాని బాగుంది బాగుంది అంటూ ఎంకరేజ్ చేసేవారు. డాన్స్ మాస్టర్ మాత్రం ఇంకాస్త బాగా చేయాలి అనేవారు. డాన్సుల విషయంలో చాలా కష్టపడ్డాను. అయితే అది పైకి కనిపించకుండా వ్యవహరించా.
‘మైత్రీ’ ఇద్దరినీ తీసుకొచ్చింది
నా భర్త ఫహాద్ ‘పుష్ప’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. నేను ఈ సినిమాతో పరిచయం అవుతున్నా. ఈ రెండు చిత్రాలను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్. వాళ్లే మా ఇద్దరినీ టాలీవుడ్‌కు తీసుకొచ్చారు. రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా తెలుగు హీరోలందరితోనూ నటించాలని ఉంది. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. కొత్త సినిమాను త్వరలో ప్రకటిస్తాను.