Karthi | ‘సత్యం సుందరం’ సినిమా స్క్రిప్ట్ చదివినప్పుడు తనకు ఓ జీవితం కనిపించిందని, కె.విశ్వనాథ్‌గారి సినిమాల తరహాలో మన సంస్కృతి, మన మూలాలను తరచి చూపిస్తుందని చెప్పారు అగ్ర హీరో కార్తీ. అరవింద్‌స్వామితో కలిసి ఆయన నటించిన ‘సత్యం సుందరం’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా సోమవారం హీరో కార్తీ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న సంగతులు..
దర్శకుడు ప్రేమ్‌కుమార్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను ఓ నవల తరహాలో రాశారు. స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు చాలా చోట్ల ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. నాకు కె.విశ్వనాథ్‌గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు. ఈ కథ చదివినప్పుడు విశ్వనాథ్‌గారి సినిమా అనుభూతినిచ్చింది. మన జీవితంలోని చాలా ప్రశ్నలకు సమాధానమిస్తుంది. అన్నయ్య సూర్యకి కూడా ఈ కథ బాగా నచ్చింది.
అన్నదమ్ముల్లాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య కథ నడుస్తుంది. ఎలాంటి షరతులులేని నిస్వార్థమైన ప్రేమ మనకు కేవలం కుటుంబంలోనే దొరుకుతుంది. అలాంటి అన్‌కండీషనల్ లవ్‌ను ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. మన సంస్కృతి, మూలాలను పట్టి చూపిస్తుంది. కథలో వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. ఇందులో నేను ఓ పల్లెటూరిలో చీరల దుకాణం నడిపే అమాయకమైన వ్యక్తిగా కనిపిస్తా. ఎలాంటి కోరికలు లేకుండా జీవితాన్ని సరదాగా గడుపుతుంటాను.
కథ మొత్తం ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. ‘సాగరసంగమం’ సినిమా చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో..అదే తరహాలో ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తారు. అరవింద్‌స్వామి కథ చదివి చాలా ఎమోషనల్ అయ్యారు. తన నిజ జీవితంలో కూడా ఈ తరహా కథ జరిగిందని చెప్పారు. మా ఇద్దరి క్యారెక్టర్స్ మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది.
ఈ సినిమాలో సంభాషణలు కూడా చాలా సహజంగా ఉంటాయి. తెరపై ఓ జీవితాన్ని చూస్తున్న అనుభూతినిస్తుంది. గోవింద్ వసంత్ అద్భుతమైన సంగీతాన్నందించారు. ప్రతీ పాట చక్కటి అర్థంతో సందర్భానుసారంగా వస్తుంది. అన్నయ్య ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలను మాత్రమే చూసుకున్నారు. క్రియేటివ్ సైడ్ ఆయన ఇన్వాల్వ్మెంట ఏమాత్రం లేదు. అన్నయ్య నా తొలి సినిమా చూసి గట్టిగా హత్తుకొని మెచ్చుకున్నారు. మళ్లీ చాలా ఏండ్ల తర్వాత ఈ సినిమాకు అదే రీతిలో స్పందించారు. అద్భుతంగా పర్ఫార్మ్ చేశావని అభినందించారు. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘సర్దార్-2’ చిత్రీకరణ జరుగుతున్నది. ‘వా వాతియారే’ సినిమా కూడా పైప్‌లైన్‌లో ఉంది. ‘ఖైదీ-2’ వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉంది.