తమిళ అగ్ర హీరో విజయ్ ‘జననాయగన్’ సినిమాకు సంబంధించిన వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటున్నది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాని కారణంగా విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ లోపే సోషల్‌మీడియాలో సినిమా లీక్ కావడం చిత్ర నిర్మాతలనే కాక, యావత్ సినీలోకాన్నే షాక్‌కి గురి చేసింది. ఇది చాలదన్నట్టు ఈ సినిమా మొత్తాన్ని కోయంబత్తూరులోని ఓ లోకల్ ఛానల్ ప్రసారం చేసింది. దాంతో చిత్రయూనిట్ దిగ్భ్రాంతికి లోనైంది.
ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేయడంతోపాటు సదరు ఛానల్ యజమానిని సైతం కష్టడీలోకి తీసుకున్నారు. ఇదిలావుంటే.. ‘జగనాయగన్’ విషయంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని.. సదరు సంస్థతో మరో సినిమా చేయాలని విజయ్ నిర్ణయించారట. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే ఈ సినిమా పని మొదలుపెట్టాలని విజయ్ భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.