సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటించి ఇటీవలే తెరపైకి వచ్చిన సినిమా ‘రాజ యోగం’. ఈ చిత్రాన్ని మణి లక్ష్మణరావు నిర్మించారు. రామ్ గణపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు థియేటర్ల నుంచి ఆదరణ బాగుందని చెబుతున్నారు చిత్రబృందం. తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ…‘మా చిత్రానికి థియేటర్ల దగ్గర నుంచి రెస్పాన్స్ బాగుంది. సినిమా ఆకట్టుకునేలా ఉన్నా వారంలోపే థియేటర్ల నుంచి తీసేస్తున్నారు. మంచి చిత్రానికి షోస్, థియేటర్స్ పెంచితే మాలాంటి కొత్త వాళ్లను ప్రోత్సహించినట్లు ఉంటుంది. ఈ సినిమా చూసి నవ్వకుండా ఉన్నవారికి నగదు బహుమతి అందిస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సాయి రోనక్, నాయిక అంకిత సాహా తదితరులు పాల్గొన్నారు.