అందం, అభినయం కలబోసిన అచ్చ తెలుగు సోయగం అంజలి యాభై సినిమాల మైలురాయిని చేరుకుంది. ‘ఫొటో’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు అనంతరం తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూ అగ్ర నాయికగా ఎదిగింది. ‘అంగాడి తెరు’ ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ వంటి చిత్రాలు ఆమె కెరీర్‌కు బ్రేక్ నిచ్చాయి. తెలుగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘గీతాంజలి’ ‘వకీల్ సాబ్’ చిత్రాల్లో చక్కటి అభినయంతో మెప్పించింది. 17 సంవత్సరాల సినీ ప్రయాణంలో తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటున్నది. తాజాగా అంజలి నటిస్తున్న యాభయ్యవ సినిమా ప్రకటన వెలువడింది. దీనికి ‘ఈగై’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. అశోక్ వేలాయుధం దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభంకానుందని, కెరీర్లో యాభై చిత్రాలకు చేరుకోవడం ఎంతో ప్రత్యేక సందర్భమని అంజలి పేర్కొంది.