Anirudh Ravichander | ఇప్పటికిప్పుడు సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే మ్యూజిక్ లవర్స్ ఠక్కున చెప్పే పేరు అనిరుధ్ రవిచందర్. కోలీవుడ్‌లోనే కాదు ఇతని డిమాండ్ పక్క వుడ్‌లలోనూ మాములుగా లేదు. ఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు నేపథ్య సంగీతంతో గూస్‌బంప్స్‌కు అసలు సిసలైన నిర్వచనం తెలుపుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనిరుధ్ నేపథ్య సంగీతం గురించి మాట్లాడని సినీ ప్రేక్షకుడు లేడు. హీరోలకు ఆయనిచ్చే ఎలివేషన్ మ్యూజిక్కు అభిమానులు చొక్కాలు చింపుకుని చిందులేస్తున్నారు. విక్రమ్‌లో కమల్‌కు, జైలర్‌లో రజనీకు అనిరుధ్ ఇచ్చిన మాస్ మ్యూజిక్కు తమిళ తంబిలే కాదు.. తెలుగు కుర్రాళ్లు సైతం పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం అనిరుధ్ సూపర్ ఫామ్‌లో వున్నాడు. విక్రమ్, జైలర్, జవాన్.. ఇలా వరుస పాన్ ఇండియా విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన స్వరపరిచిన పాటలు, నేపధ్య సంగీతం నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. మ్యూజిక్ యాప్స్ లో అనిరుధ్ పాటలు రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అలరిస్తున్న అనిరుధ్ తాజాగా తన కంపోజ్ స్టయిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అనిరుధ్ ప్రతి ట్యూన్ ని ముందుగా పియానో తో రికార్డ్ చేస్తారట. ఈ పియానోకి ఒక ప్రత్యేకత వుంది. ‘కత్తి’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత హీరో విజయ్ ఈ పియానోని అనిరుధ్ కి గిఫ్ట్ గా ఇచ్చారట. అప్పటినుంచి తన పాటలన్నీ ముందుగా ఈ పియానోపైనే స్వరపరుస్తున్నారట అనిరుధ్.
పియానో సౌండ్ తో విన్న ట్యూన్స్ ని దర్శకులు ఓకే అంటే తర్వాత దానికి ఆర్కెస్ట్రా, వోకల్స్ ని యాడ్ చేస్తానని, కత్తి తర్వాత తను సంగీతం అందించిన అన్ని సినిమాలకి ఇలానే వర్క్ చేశాని చెప్పారు అనిరుధ్. విజయ్ హీరోగా వస్తున్న ‘లియో‘ సినిమాకి కూడా ఆయననే మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ కొరటాల శివ ‘దేవర’ సినిమాకి కూడా అనిరుధే స్వరాలు సమకూరుస్తున్నారు.