Anil Ravipudi | టాలీవుడ్లో విజయవంతమైన కాంబినేషన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ‘#VenkyAnil5’ (NKRAR2) వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్ పేరుతో కొందరు మోసగాళ్లు సోషల్ మీడియాలో నకిలీ కాస్టింగ్ కాల్స్ నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి రావడంతో చిత్ర బృందం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని ‘#VenkyAnil5’ సినిమా పేరుతో కొన్ని నకిలీ కాస్టింగ్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు చిత్ర యూనిట్ దృష్టికి వచ్చింది. కొందరు వ్యక్తులు సినిమా యూనిట్ సభ్యులమంటూ పరిచయం చేసుకుని, ఆడిషన్స్ పేరుతో వివరాలు సేకరించడం, డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతోందని సమాచారం.
దీంతో వెంటనే స్పందించిన నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.చిత్ర నిర్మాణ సంస్థలు విడుదల చేసిన ప్రకటనలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న కాస్టింగ్ కాల్స్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.మా సినిమా పేరును ఉపయోగించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ కాస్టింగ్ కాల్స్ పూర్తిగా నకిలీ. వాటికి చిత్ర బృందం, నిర్మాతలు లేదా దర్శకులతో ఎలాంటి సంబంధం లేదు అని వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు వస్తాయనే ఆశతో ఎవరైనా తమ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, డాక్యుమెంట్లు లేదా ఇతర సమాచారాన్ని తెలియని వ్యక్తులకు ఇవ్వవద్దని చిత్ర యూనిట్ హెచ్చరించింది.ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అనేక రకాల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో యువత మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
చిత్ర యూనిట్ తరఫున మరో కీలక సూచన కూడా చేశారు. సినిమా అవకాశాలు, ఆడిషన్స్, సెలెక్షన్స్ పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే అప్రమత్తం కావాలని తెలిపారు.#VenkyAnil5″ చిత్ర బృందం ఎప్పుడూ కాస్టింగ్ కోసం డబ్బులు వసూలు చేయదని స్పష్టం చేసింది. ఎలాంటి చెల్లింపులు చేయవద్దని, మోసగాళ్ల మాటలు నమ్మవద్దని యువతకు విజ్ఞప్తి చేసింది. భవిష్యత్తులో ఈ చిత్రానికి సంబంధించి నిజమైన కాస్టింగ్ అవసరాలు ఉంటే, వాటికి సంబంధించిన సమాచారం కేవలం అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, నిర్మాణ సంస్థల ప్రకటనల ద్వారానే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.అధికారికంగా ప్రకటించని ఎలాంటి సమాచారం లేదా కాస్టింగ్ ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఐదో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో కనిపించనుండగా, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.