మెగాస్టార్ చిరంజీవి పర్ఫెక్షనిస్ట్. ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతారు. ఇక ఆయన కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరు పూర్తిస్థాయి కామెడీ సినిమా చేస్తే చూడాలని ఆయన అభిమానులు ఆతృతగా ఎదరుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ ఫుల్‌లెంగ్త్ కామెడీ రోల్ కోసం ఆయన సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
షైన్‌స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ పతాకాలపై సాహు గారపాటి నిర్మించనున్నారు. బుధవారం సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో అద్భుతమైన కామెడీ, యాక్షన్, ఎమోషన్ మేళవించి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, కథ విన్నవెంటనే చిరంజీవి సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, వినోదానికి సరికొత్త నిర్వచనంలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా చిరంజీవి..శంకర్ వరప్రసాద్‌గా పూర్తి స్థాయి కామెడీ అవతార్‌లో కనిపిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.