Nayanthara | సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించింది అగ్ర కథానాయిక నయనతార. తాజాగా ఈ భామ మరోమారు చిరుతో ఆడిపాడేందుకు సిద్ధమవుతున్నది. చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘మెగా157’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాతలు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించనుంది. ఇప్పటికే ఈ వార్త ప్రచారంలో ఉండగా తాజాగా మేకర్స్ అధికారికంగా ఖరారు చేశారు.
ఈ సందర్భంగా శనివారం దర్శకుడు అనిల్ రావిపూడి స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో నయనతార తెలుగులో మాట్లాడటం, కారు ప్రయాణంలో చిరంజీవి క్లాసిక్ పాటలు వినడం, స్క్రిప్ట్ చదవడం, చిరు డైలాగ్ చెప్పడం ఆకట్టుకునేలా ఉంది. చివరగా తాను చిరంజీవి సరసన నటిస్తున్నట్లు నయనతార అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చక్కటి హాస్యం కలబోతగా సాగుతుందని, అభిమానులు పండుగ చేసుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నామని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.