Anil Ravipudi | టాలీవుడ్లో వరుస విజయాలతో ‘హిట్ మిషన్’గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 2027 సంక్రాంతి బరిలోకి ఈసారి మల్టీస్టారర్ చిత్రంతో దిగేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సినిమాలో వెంకటేష్, కల్యాణ్ రామ్ కలిసి నటించనుండటం విశేషం. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరోయిన్ల విషయానికి వస్తే, కృతిశెట్టి ఒక కథానాయికగా ఫిక్స్ కాగా, మరో కీలక పాత్ర కోసం కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా కాస్టింగ్ మరింత బలంగా మారుతోంది.
ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ చిత్రం ఓటీటీ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి గత చిత్రాలకు ఓటీటీలో వచ్చిన ఆదరణ దృష్ట్యా ఈ డీల్ రికార్డు స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు విశాఖపట్నంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రతి సినిమా స్క్రిప్ట్‌ను వైజాగ్‌లోనే పూర్తి చేసే సెంటిమెంట్ ఉన్న అనిల్ రావిపూడి, ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌ను లాక్ చేసినట్లు సమాచారం.
త్వరలోనే షూటింగ్ ప్రారంభించి, సంక్రాంతి సీజన్లో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం, అనిల్ రావిపూడి స్టైల్ కామెడీ, ఎమోషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. స్టార్ హీరోల కలయిక, హిట్ డైరెక్టర్ కాంబో, భారీ ఓటీటీ డీల్ అన్నీ కలిసి ఈ సినిమాను ఇప్పటినుంచే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలబెడుతున్నాయి. కాగా, అనీల్ రావిపూడి ఇప్పటి వరకు తెరకెక్కించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన విషయం తెలిసందే.