అగ్ర హీరో చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే.. వింటేజ్ లుక్ అంటూ తెగ ఆరాటపడిపోతుంటారు నేటి యువ దర్శకులు. అయితే.. నిజానికి ఆనాటి చిరంజీవిని ఏడు పదుల ఈ వయసులో ఆవిష్కరించడం సాథ్యమా? అసలు ఆ ఆలోచన కరెక్టేనా? చిరంజీవి సాటి హీరోలైన రజనీకాంత్, కమల్‌హాసన్, మమ్ముట్టి, బాలకృష్ణ, మోహన్‌లాల్ లాంటివాళ్లు వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ విజయాలను అందుకుంటున్న తరుణంలో ఇంకా వింటేజ్ లుక్ అంటూ పాకులాడటం యంగ్ డైరెక్టర్లకు కరెక్ట్ కాదేమో.. దర్శకుడు అనిల్ రావిపూడి చేయబోతున్న సినిమాలో కూడా చిరంజీవి వింటేజ్ లుక్‌లో కనిపిస్తారని, డ్యూయెట్లతో స్పెప్పులతో మోత పుట్టిస్తారని, సినిమాపేరు ‘సంక్రాంతి అల్లుడు’ అంటూ.. రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటన్నింటికీ తను రాసుకున్న కథతో చెక్ పెట్టేశారట అనిల్ రావిపూడి.
మెగాస్టార్ కోసం ఆయన రాసుకున్న కథకు సంబంధించిన అసలైన సమచారం వెలుగు చూసింది. ఇందులో చిరంజీవికి డ్యూయెట్లే ఉండవట. లవ్ ట్రాక్ అసలే ఉండదట. పైగా కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌గా వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తారట. అలాగే.. కామెడీ విషయంలోనూ అనిల్ రాజీపడలేదట. కామెడీ పండించడంలో మెగాస్టార్ మాస్టర్ అని అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టే క్యారెక్టరైజేషన్ కూడా రాసుకున్నారట అనిల్. ఇక యాక్షన్ సీన్స్ అయితే ఓ రేంజ్‌లోనే ఉంటాయని తెలుస్తున్నది. రాయలసీమ నేపథ్యంలో కథంతా సాగుతుందనీ, అందుకే చిరంజీవి కూడా చిత్తూరు యాసను ప్రాక్టీస్ చేసే పనిలో ఉన్నారనీ సమాచారం. మొత్తంగా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమే వీర్దిదరి కాంబినేషన్లో రానున్నదని తెలుస్తున్నది.