Anil Ravipudi | సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాతో ఆయన తొలిసారి పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ‘వారణాసి’ తర్వాత మహేష్ చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.ఈ క్రమంలో టాలీవుడ్లో ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు మరోసారి నటించబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో.. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుందనే వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది.
‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారని, ఇప్పటికే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. గతంలోనూ మహేష్–అనిల్ కాంబినేషన్లో మరో సినిమా వస్తుందనే వార్తలు పలుమార్లు వినిపించాయి. దీంతో తాజాగా వచ్చిన రూమర్స్ నిజమేనని అభిమానులు భావించారు. మహేష్ బాబుతో మరో సినిమా చేయనున్నారనే వార్తలపై అనిల్ రావిపూడి ఎక్స్ వేదికగా స్పందించారు. మహేష్ తనకు ఎంతో ఆత్మీయుడని, ఆయనపై తనకు ఎప్పుడూ అపారమైన ప్రేమ, గౌరవం ఉంటాయని తెలిపారు. అదే సమయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. “ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం. అవి నిజం కాదు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ను నమ్మకండి.. ప్రచారం చేయకండి” అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.
అనిల్ రావిపూడి ఇచ్చిన ఈ క్లారిటీతో మహేష్ బాబు–అనిల్ రావిపూడి కాంబినేషన్లో త్వరలోనే మరో సినిమా రాబోతుందనే ప్రచారానికి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌ను మరోసారి తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు పూర్తిగా ‘వారణాసి’* పై దృష్టి పెట్టగా, అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నారు. భవిష్యత్తులో వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.