Anil Ravipudi | సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించి మరోసారి ఆయన స్టామినాను నిరూపించింది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను దాటి లాభాల బాట పట్టిన ఈ సినిమా, చిరంజీవి కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఘన విజయం నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్ సినీ వర్గాల్లోనే కాదు, అభిమానుల్లో కూడా ప్రత్యేకంగా నిలిచింది. సినిమా హిట్‌కు గుర్తుగా దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇవ్వడం పెద్ద చర్చకు దారితీసింది. ఇక సక్సెస్ మీట్లో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది దర్శకుడు అనిల్ రావిపూడి తండ్రి చేసిన భావోద్వేగ ప్రసంగం. తన కుమారుడి జీవిత ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఆయన చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. గుంటూరులో బీటెక్ చదువుతున్న రోజుల్లో అనిల్ థర్డ్ ఇయర్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, సాధారణంగా ఇలాంటి వేదికలపై ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడరని, కానీ అదే అనిల్ జీవితంలో కీలక మలుపు కావడంతో చెప్పాల్సి వచ్చిందన్నారు.
చిన్నప్పటి నుంచే అనిల్, అతని స్నేహితుడు చిరంజీవి గారి వీరాభిమానులని తెలిపారు. వారానికి మూడు సినిమాలు చూసేంతగా సినిమాలపై మక్కువ ఉండేదని చెప్పారు. అయితే సబ్జెక్టులు ఫెయిల్ అయినప్పుడు, “చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అనే పేరు ఆయనకు రావద్దు” అంటూ తండ్రిగా తాను చెప్పిన మాట అనిల్‌ను లోపల నుంచి కుదిపేసిందని, ఆ తర్వాత అతను కష్టపడి చదివి ఫస్ట్ మార్కులతో సబ్జెక్టులు పూర్తి చేశాడని గర్వంగా వెల్లడించారు. చిరంజీవి గారితో కలిసి పని చేయడం తమ కుటుంబానికి దేవుడు ఇచ్చిన వరమని భావోద్వేగానికి లోనయ్యారు. ఒకప్పుడు చిరంజీవిని దూరం నుంచి చూడటానికే అభిమానులు టికెట్ల కోసం పోటీ పడే రోజులు ఉండేవని గుర్తు చేస్తూ, అలాంటి హీరోకి తన కుమారుడు దర్శకత్వం వహించడం జీవితంలో మర్చిపోలేని ఘట్టమని అన్నారు.
కేరళ షూటింగ్ సమయంలో చిరంజీవి గారు స్వయంగా పిలిచి తన చేతులతో భోజనం పెట్టిన సంఘటనను గుర్తు చేసుకుంటూ, అది తమ కుటుంబానికి అమూల్యమైన జ్ఞాపకమని చెప్పారు. సినిమా విజయం గురించి షూటింగ్ సమయంలోనే తన అంచనాలను చిరంజీవి గారితో పంచుకున్నానని తెలిపారు. ముఖ్యంగా చిరంజీవి గారి స్టైల్, వైట్ షర్ట్–పసుపు ప్యాంట్ కాంబినేషన్ చూసినప్పుడే ఈ సినిమా 400 నుంచి 500 కోట్ల వసూళ్లు సాధిస్తుందని చెప్పానని వెల్లడించారు. దర్శకుడు అనిల్ 100 మైళ్ల వేగంతో పని చేస్తే, చిరంజీవి గారు దాన్ని 200 మైళ్ల వేగానికి తీసుకెళ్లారని ప్రశంసించారు. చివరగా ఈ సినిమాలో చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన తీరు చూసి ఒకప్పుడు ఎన్టీఆర్–ఏఎన్నార్ కలిసి నటించిన రోజులు గుర్తొచ్చాయని కొనియాడారు.