Janhvi Kapoor | బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో బిజీగా ఉంటూనే, సౌత్ సినిమాల్లోనూ తన మార్క్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో నటించిన “దేవర” చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న జాన్వీ, త్వరలోనే రామ్ చరణ్ సరసన “పెద్ది” సినిమాతో పలకరించబోతుంది. ఈ సినిమాపై జాన్వీ చాలా హోప్స్ పెట్టుకుంది.ఈ సినిమాని బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధతో తెరకెక్కిస్తుండగా, ఇందులో జాన్వీ పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండనుందని అంటున్నారు. అయితే తాజాగా జాన్వీ గురించి బాలీవుడ్ ప్రముఖ నటుడు, ఆమె బాబాయ్ అయిన అనిల్ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి.
సాధారణంగా స్టార్ హీరోయిన్ షూటింగ్‌కి వస్తే, రెమ్యూనరేషన్ కాకుండా, ఆమె ట్రావెలింగ్, హోటల్, ఫుడ్ ఖర్చులతో పాటు, స్టాఫ్, తల్లి, మేనేజర్ల ఖర్చులు అన్నీ నిర్మాతే భరిస్తారు. ఇది ఇండస్ట్రీలో ఓ సాధారణ నిబంధనగా మారిపోయింది. అయితే ఈ విషయంలో జాన్వీ కపూర్ మాత్రం భిన్నంగా ఉంటుందని అనిల్ కపూర్ వెల్లడించాడు. జాన్వీ ఎక్కడికైనా షూటింగ్‌కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫ్లైట్ టికెట్లు తనవే. స్టాఫ్ కావొచ్చు, సహాయులు కావొచ్చు, ఎవ్వరైనా ఆమెతో వస్తే వాళ్ల ఖర్చులు కూడా జాన్వీనే భరిస్తుంది. నిర్మాతలపై ఎలాంటి అదనపు భారంగా మోపదు. ఆమె అంతా స్వయంగా చూసుకుంటుంది అని అన్నారు అనిల్.
అనిల్ కపూర్ ఈ కామెంట్స్ చేసిన తర్వాత, జాన్వీ కపూర్‌పై పరిశ్రమవర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇప్పటి తారలు చిన్న విషయానికే పెద్ద బడ్జెట్ భారాన్ని నిర్మాతలపై మోపుతున్న కాలంలో, జాన్వీ లాంటి స్టార్ హీరోయిన్ తన ఖర్చులను తానే భరించడం నిజంగా ప్రశంసనీయం అంటున్నారు. జాన్వీని చూసి ఇతర హీరోయిన్స్ తమ పద్ధతిని మార్చుకుంటారా అని ముచ్చటించుకుంటున్నారు. ఈ రోజుల్లో నిర్మాతలు ఖర్చుల విషయంలో తడిసి ముద్దవుతున్నారు. అలాంటి సమయంలో జాన్వీ లాంటి సెలబ్రిటీలను ఆదర్శంగా తీసుకుంటే, ఇండస్ట్రీకి అంతా మంచి జరుగుతుంది. ఇక జాన్వీకి ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తోపాటు, త్వరలో మరిన్ని సౌత్ ఆఫర్స్ లైన్లో ఉన్నట్టు సమాచారం.