Nani | ‘మన మధ్యలో ఏదో తెలియని బంధం ఉంది. దానిని మరింత పటిష్టం చేసే సినిమా ‘సరిపోదా శనివారం’. రిలీజ్ రోజున థియేటర్లన్నీ మార్మోగిపోతాయి’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో అగ్ర నిర్మాత దిల్రాజు విడుదల చేస్తున్నారు.
బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం మీ అందరిలాగే ఆతృతగా ఎదురుచూస్తున్నా. తనవాళ్ల శ్రేయస్సు కోసం కోపాన్ని పాజిటివ్ వేలో ఉపయోగించే ఓ వ్యక్తి కథ ఇది. ఇప్పుడు నాకు కోపం వచ్చింది. నాకు కోపం వచ్చిందంటే బ్లాక్బస్టర్ హిట్ పక్కా (నవ్వుతూ)’ అన్నారు. నాని గత చిత్రం ‘దసరా’ను ఈ సినిమా బీట్ చేస్తుందనే నమ్మకం ఉందని, దర్శకుడు వివేక్ అద్భుతంగా తెరకెక్కించాడని దిల్రాజు తెలిపారు. గొప్ప కథను దర్శకుడు వివేక్ అంతే గొప్పగా తెరకెక్కించాడని, నాని నటన హైలైట్గా నిలుస్తుందని నిర్మాత డీవీవీ దానయ్య చెప్పారు. ఈ సినిమాలో తాను చారులత అనే బ్యూటీఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తానని కథానాయిక ప్రియాంక మోహన్ పేర్కొంది.