Anasuya | అందాల ముద్దుగుమ్మ అనసూయ ఇంట్లో వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. తన ఇంట్లో జరిగే వేడుకలకి సంబంధించిన ప్రతి విషయాన్ని అనసూయ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంది. కొద్ది రోజుల క్రితం తన భర్తతో కలిసి కొత్తింటిలోకి అడుగుపెట్టింది. తన ఇంటికి ‘శ్రీరామ సంజీవని’ అనే పేరు పెట్టిన విషయాన్ని అనసూయ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ తర్వాత హోమాలు, సత్యనారాయణవ్రతం, నవగ్రహా శాంతి, వాస్తు మొదలైన పూజలు చేయించింది. వాటికి సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేసింది.
ఇంట్లో చేసిన హోమంలో ఆంజనేయ స్వామి ప్రతిరూపం కన్పించడంతో అనసూయ భావోద్వేగానికి గురైంది. హనుమంతుడి ప్రతీరూపంకి సంబంధించిన ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. ఏకంగా ఆంజనేయ స్వామి తన ఇంటికి వచ్చాడని ఎమోషనల్ అయింది. ఇక తాజాగా అనసూయ ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. ఆమె పెద్ద కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు శాస్త్రోక్తంగా ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్త ఇంట్లో ఈ వేడుకను అనసూయ కుటుంబ సభ్యులు ఘనంగా జరిపారు. ఈ ఉపనయన వేడుకకు సంబంధించిన ఓ అందమైన వీడియోను అనసూయ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయగా, ఈ వీడియో వైరల్ అయింది.
వీడియోలో సంప్రదాయ వస్త్రధారణలో శౌర్య, కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. ఇక ఈ వేడుక విషయంలో అనసూయ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ క్షణాలు తమకెంతో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. ఈ ఆధునిక కాలంలో కూడా తమ ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను గౌరవించి, ఉపనయనానికి సిద్ధపడిన కుమారుడిని చాలా గర్వంగా ఉందంటూ, కుమారుడిని మనస్ఫూర్తిగా అభినందించారు. ఇక అనసూయ ప్రస్తుతం నటిగా, జడ్జిగా సందడి చేస్తుంది. రంగస్థలం చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ పుష్ప చిత్రంతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది.