Anasuya | సోషల్ మీడియాలో తన గౌరవానికి భంగం కలిగించేలా అభ్యంతరకర పోస్టులు, వీడియోలతో వేధింపులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యకరమైన వీడియోలు తయారు చేయడం, వృత్తి మరియు వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కించపరిచే కంటెంట్‌ను కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ తరహా చర్యల వల్ల తాను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని, తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనసూయ ఫిర్యాదులో కోరారు.
మహిళగా, ప్రజా జీవితం ఉన్న వ్యక్తిగా తనపై జరుగుతున్న ఈ దాడులు సహించదగ్గవి కాదని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఇతరులకూ పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. అనసూయ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో మదర్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ బొజ్జా సంధ్యారెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు ప్రియా చౌదరి, గోగి నేని సహా మొత్తం 42 మందిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా అనసూయను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర కంటెంట్‌ను సృష్టించడం, ప్రచారం చేయడంలో వీరి పాత్ర ఉందని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
ప్రస్తుతం పోలీసులు సోషల్ మీడియా ఖాతాలు, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అవసరమైతే మరిన్ని సెక్షన్లు కూడా జోడించే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ఈ ఘటనపై సినీ, టెలివిజన్ వర్గాలు స్పందిస్తూ అనసూయకు మద్దతు తెలుపుతున్నాయి. మహిళలపై ఆన్లైన్ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.