టిక్‌టాక్‌లో పుట్టి.. యూట్యూబ్‌తో జట్టుకట్టి.. తాజాగా వెబ్‌సిరీస్‌లతో అదరగొడుతున్నది అనన్య శర్మ. ఈ వరంగల్ అమ్మాయి సినీతారగా ఓ వెలుగు వెలగడమే తన లక్ష్యం అంటున్నది. ఆమె నటించిన వెబ్‌సిరీస్ ‘అర్థమైందా అరుణ్‌కుమార్’ ఆహాలో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా అనన్య శర్మ ‘జిందగీ’తో పంచుకున్న సంగతులు..
సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అంతమాత్రాన యాక్టర్ అయిపోతానంటే కుదురుతుందా? చూడటం వేరు, అందులో నటించడం వేరు! ఇంటర్లో ఉన్నప్పుడే నటనపై ఆసక్తి ఏర్పడింది. వన్ ఫైన్ మార్నింగ్ అమ్మతో ‘నేను యాక్టర్ అవుతా’ అని చెప్పాను! అమ్మ ఆశ్చర్యపడింది. ‘ముందు చదువుపై శ్రద్ధ పెట్టు’ అన్నది. ఆ క్షణం కాస్త చిన్నబుచ్చుకున్నా.. అమ్మ మాటలోనూ నిజం ఉందనిపించింది. పైగా అమ్మానాన్నా ఇద్దరూ లెక్చరర్లే. నాన్న రమేశ్ శర్మ కెమిస్ట్రీ లెక్చరర్. అమ్మ ప్రగతి జువాలజీ అధ్యాపకురాలు. ఒక్కగానొక్క కూతుర్ని నేను. గారాబం చేసేవారు. అలాగని చదువు దగ్గర నిర్లక్ష్యం చేస్తే ఒప్పుకొనేవారు కాదు.
క్యాంపస్‌లో బీజం
చెన్నైలో ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు.. కాలేజ్‌లో డ్రామా క్లబ్ ఉండేది. అక్కడే నటనలో ఓనమాలు దిద్దుకున్నాను. నాలుగేండ్ల ఇంజినీరింగ్‌లో క్యాంపస్‌లో ఉన్నది రెండేండ్లే! మిగిలిన రెండు సంవత్సరాలనూ కొవిడ్ కాజేసింది. అలా ఇంజినీరింగ్ స్టూడెంట్ లైఫ్ సగమే ఎంజాయ్ చేశాను. అయితే, ఆన్లైన్ క్లాసులు కావడంతో ఫ్రీ టైమ్ ఉండేది. క్యాంపస్‌లో నేర్చుకున్న నట విన్యాసాలన్నీ ప్రదర్శించడానికి టిక్ టాక్‌ను వేదికగా ఎంచుకున్నా. రెగ్యులర్‌గా రీల్స్ చేస్తుండేదాన్ని. నటనపై సీరియస్‌గా ఉన్నానని అమ్మావాళ్లకు కూడా అర్థమైంది.
వయా యూట్యూబ్
నటనను కెరీర్‌గా మలుచుకోవడానికి షార్ట్‌ఫిల్మ్ దగ్గరి దారి అనిపించింది. అయితే, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలిసేది కాదు. అప్పుడు నా క్లాస్మేట్ హర్షిత్‌రెడ్డి గుర్తుకొచ్చాడు. చాయ్‌బిస్కెట్ యూట్యూబ్ చానెల్‌తో అసోసియేట్ అయ్యాడని తెలిసింది. అతణ్ని సంప్రదిస్తే విలువైన సలహాలు ఇచ్చాడు. అదే సమయంలో వాళ్లు ‘బ్రదర్ అండ్ సిస్టర్’ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. ఆడిషన్ చేసి నన్ను సిస్టర్ పాత్రకు ఎంచుకున్నారు. అలా నా మొదటి షార్ట్‌ఫిల్మ్ యూ
ట్యూబ్కెక్కింది. ఆ వెంటనే ‘30 వెడ్స్ 21’ వెబ్‌సిరీస్‌లో హీరోయిన్ చాన్స్ వచ్చింది. విభిన్నమైన మనస్తత్వం ఉన్న పాత్ర అది. దర్శకుడు పృథ్వీ, అతని టీమ్ సహకారంతో ఆ క్యారెక్టర్‌ను సమర్థంగా పోషించాను. ఇంట్లోవాళ్లు, ఫ్రెండ్స్.. అందరూ సంతోషించారు. ఈ ఆనందంలో ఉండగానే ‘లాలీపాప్’ సాంగ్ నన్ను మరింత వైరల్ చేసింది. తాజాగా ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నందుకు థ్రిల్‌గా ఫీలవుతున్నా. ‘అర్థమైందా అరుణ్‌కుమార్’లో నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. దీన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లు, సూపర్ ఉమెన్ పాత్రలు చేయాలని ఉంది.