తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మంచి నటి మాత్రమే కాదు, మంచి మనసున్న అమ్మాయి కూడా. తన సంపాదనలో ఎంతో కొంత చారిటీలకే ఖర్చు చేస్తూవుంటుంది. మల్లేశం, వకీల్‌సాబ్, పొట్టేల్ చిత్రాల ద్వారా టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపును సాధించింది అనన్య నాగళ్ల. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తొలిప్రేమ బ్రేకప్ విశేషాలను అనన్య నాగళ్ల పంచుకున్నది. ‘కెరీర్లో పొగడ్తలు, తెగడ్తలు సహజం. అన్నింటినీ అలవాటు చేసుకున్నా.
కానీ వ్యక్తిగత జీవితంలో ప్రేమ విఫలమైనప్పుడు మాత్రం బాధ భరించలేకపోయా. నేను ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొంత కాలానికే నాకు బ్రేకప్ అయ్యింది. రెండేళ్ల పాటు మనసులో ముల్లులా ఆ బాధ గుచ్చుకుంటూనే ఉంది. అయితే.. వర్క్‌పై మాత్రం ఆ ప్రభావం పడనిచ్చేదాన్ని కాదు. రాత్రంతా ఏడ్చేదాన్ని. ఉదయాన్నే జిమ్కెళ్లిపోయేదాన్ని. షూటింగ్ టైమ్‌లో కారవాన్‌లో ఏడ్చేదాన్ని. షాట్ అవ్వగానే ఏం జరగనట్టు బయటకొచ్చేదాన్ని. ఈ విషయం ఇప్పటివరకూ ఇంట్లోవాళ్లకు కూడా తెలియదు. స్నేహితులకు మాత్రమే తెలుసు.’ అంటూ చెప్పుకొచ్చింది అనన్య నాగళ్ల.