ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో వినోదాల విందును పంచడానికి సిద్ధమవుతున్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం ‘రాజుగారి పెళ్లి రిసెప్షన్ వేడుక’ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో నాయకానాయికలు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నూతన వధూవరుల గెటప్‌లో వేదికపై సందడి చేశారు. నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ ‘సంక్రాంతి సినిమా అంటేనే వినోదం.
అందులో ఓ వైబ్ ఉంటుంది. ఇంటిల్లిపాది కలిసి చూసేలా ఆద్యంతం సంపూర్ణ హాస్యంతో ఈ సినిమా తీశాం. ఈ సంక్రాంతి బరిలో నిలుస్తున్న చిత్రాలన్నీ విజయం సాధించాలని, తెలుగు సినిమా సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఇది తనకు మూడో సంక్రాంతి చిత్రమని, చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అలరిస్తుందని కథానాయిక మీనాక్షి చౌదరి తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, దర్శకత్వం: మారి.