తిరువనంతపురం : యువ నటిపై లైంగిక దాడికి పాల్పడి వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు, నిర్మాత విజయ్ బాబును అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ఎగ్జిక్యూటివ్ కమిట నుంచి తొలగించింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ తాను అమ్మ నుంచి తప్పుకుంటానని నటుడు విజ్ఞప్తిని మన్నించి అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినందున తన కారణంగా అసోసియేషన్ ప్రతిష్ట దెబ్బతినరాదనే ఉద్దేశంతో తనను అమ్మ నుంచి తాత్కాలికంగా తొలగించాలని విజయ్ బాబు అసోసియేషన్‌కు లేఖ రాశారు.
కొచ్చిలో జరిగిన సంస్ధ కార్యవర్గ సమావేశంలో విజయ్ బాబును ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని అమ్మ ప్రధాన కార్యదర్శి ఎడవెల బాబు తెలిపారు. మరోవైపు విజయ్ బాబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా మళయాళ సినీ పరిశ్రమ స్పందించకపోవడాన్ని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) ప్రశ్నించింది. ఇక విజయ్ బాబును తమ ఎదుట హాజరుకావాలని కొచ్చి పోలీసులు ఈ మెయిల్ ద్వారా నిందితుడికి పంపారు. విజయ్ దుబాయ్ పారిపోయాడనే సమాచారంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం విజయ్ తమిళనాడులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు.
ఇక మరో మహిళ సైతం విజయ్ బాబు తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించడం కలకలం రేపింది. విజయ్ బాబు ఓ సమావేశంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మీటూ కేరళ ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో ఆమె రాసుకొచ్చింది. అతడితో తనకు కేవలం 20-30 నిమిషాల పరిచయమే ఉన్నా తనను ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడని తెలిపింది. ఈ ఘటనతో కలతచెందిన తాను సినీ పరిశ్రమకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకునేలా చేసిందని పేర్కొంది. నటుడు విజయ్ బాబు మద్యం సేవించి తనను కూడా తీసుకోవాలని కోరగా తాను నిరాకరించానని గుర్తుచేసుకుని తన పనిలో నిమ్నగమయ్యానని గుర్తుచేసుకుంది. ఆపై తన ఆమోదం లేకుండానే తనను ముద్దుపెట్టుకునేందుకు దగ్గరకు రాగా తాను వెనక్కి జరిగానని చెప్పింది. తాను కోపంగా అతడి ముఖం వైపు చూడగా కేవలం ఓ ముద్దు ఇవ్వాలని అడిగాడని ఇన్‌స్టా పోస్ట్‌లో ప్రస్తావించింది.