పలు సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించారు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్. నటులుగా కలిసి నటించడాన్ని తామిద్దరం ఆస్వాదిస్తామని, అయితే ఒక మంచి స్క్రిప్ట్‌లోనే తాము భాగమవ్వాలని కోరుకుంటామని తెలిపారు అభిషేక్ బచ్చన్. తండ్రి అమితాబ్‌తో కలిసి ఆయన ‘సర్కార్’ సిరీస్ సినిమాలతో పాటు ‘కభీ అల్విదా న కెహనా’, ‘పా’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ సినిమాల్లో వీరి కాంబినేషన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ పేరును కొనసాగించే సినిమాల కోసమే తాము వేచి చూస్తున్నట్లు అభిషేక్ చెప్పారు.
ఆయన మాట్లాడుతూ…‘నాన్నతో కలిసి ఇప్పటిదాకా చేసిన చిత్రాలన్నీ ఎంతో ప్రత్యేకమైనవి. అవన్నీ మా కెరీర్లో గుర్తుండిపోయాయి. ఈ పేరును కాపాడే స్థాయి చిత్రాల్లోనే కలిసి నటించాలని కోరుకుంటున్నాం. మంచి స్క్రిప్ట్స్ కోసం వేచి చూస్తున్నాము’ అన్నారు. త్వరలో అమితాబ్, అభిషేక్ కలిసి ‘ఘూమర్’ అనే సినిమాలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్ బాల్కీ రూపొందిస్తున్నారు. ఒక్క చేతితో షూటింగ్లో పాల్గొని రెండు సార్లు ఒలంపిక్ మెడల్స్ గెల్చిన హంగేరియన్ షూటర్ కరోలీ టకాక్స్ బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నది.