Ronnie Bowman | ప్రముఖ అమెరికన్ గాయకుడు, బ్లూగ్రాస్ మరియు కంట్రీ మ్యూజిక్ లెజెండ్ రోనీ బోమాన్ (64) కన్నుమూశారు. మార్చి 22న టేనస్సీలోని నాష్‌విల్లేలో జరిగిన ఒక మోటార్‌సైకిల్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం ఆష్‌ల్యాండ్ సిటీ సమీపంలో రోనీ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురవ్వగా, తీవ్ర గాయాలైన ఆయనను వెంటనే నాష్‌విల్లేలోని వాండర్బిల్ట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
రోనీ బోమాన్ తన అద్భుతమైన గాత్రంతో, పాటల రచనతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంటర్నేషనల్ బ్లూగ్రాస్ మ్యూజిక్ అసోసియేషన్ (IBMA) నుంచి దాదాపు మూడుసార్లు ‘మేల్ వోకలిస్ట్ ఆఫ్ ది ఇయర్’ (1995, 1998, 1999) అవార్డులను అందుకుని రికార్డు సృష్టించాడు. అంతేగాకుండా 1990 నుంచి 2001 వరకు ‘ది లోన్సమ్ రివర్ బ్యాండ్’లో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన, ఆ తర్వాత సోలో సింగర్‌గా మరియు సాంగ్ రైటర్‌గా రాణించారు. ఆయన రాసిన పాటలను క్రిస్ స్టేపుల్టన్, కెన్నీ చెస్నీ వంటి హాలీవుడ్ అగ్రశ్రేణి కంట్రీ స్టార్లు ఆలపించడం విశేషం. ఇక రోనీ బోమాన్ మృతి పట్ల సంగీత ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.