Hari Hara Veera Mallu | పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదలపై అమెజాన్ ప్రైమ్ వీడియో ఒక అల్టిమేటం ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదల ఆలస్యం అవుతుండటంతో, అమెజాన్ ప్రైమ్ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే మే 9, జూన్ 12న విడుదల కావాల్సిన ‘హరిహర వీరమల్లు’ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఇప్పటికే రెండుసార్లు అమెజాన్ ప్రైమ్ వీడియోతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని మేకర్స్ సవరించినట్లు సమాచారం. అయితే, మూడోసారి మాత్రం అమెజాన్ ప్రైమ్ తన స్పష్టమైన అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, జూలై నెలాఖరులోపు సినిమా విడుదల కాకపోతే, ఓటీటీ డీల్‌ను రద్దు చేసే అవకాశం ఉందని లేదా ఒప్పందం చేసుకున్న మొత్తంలో కోత విధిస్తామని అమెజాన్ ప్రైమ్ హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఇది చిత్రబృందంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుండగా.. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ధనుష్ నటించిన కుబేర(Kubera) సినిమాను రెండు వారాలు వాయిదా వేయాలని చిత్ర నిర్మాతలు ప్రైమ్ వీడియోని కోరగా.. ప్రైమ్ రూ.10 కోట్లు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే హరిహర వీరమల్లు ఇంకా ఆలస్యం చేస్తుండటంతో ప్రైమ్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.