Sara Ali Khan | బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నది. జమ్మూకశ్మీర్‌లోని మంచుగుహలో బాబా బర్ఫానిని దర్శించుకుంది. అనంతరం అమర్నాథ్ గుహ నుంచి కిందకు వస్తుండగా అక్కడే ఉన్న పలువురు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. సారా వెంట భద్రతా సిబ్బంది ఉన్నారు. సారా అలీఖాన్ ఇటీవల మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఖజ్రానా గణేశ్ టెంపుల్లో వినాయకుడికి పూజలు చేసింది. ‘జరా హట్కే జరా బచ్చే’ విడుదలైన సందర్భంగా.. వినాయకుడిని దర్శించుకొని పూజలు చేసింది.
అలాగే బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన కుటుంబ సభ్యులతో అమర్నాథ్ యాత్రలో పాల్గొని, మంచులింగాన్ని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. వాతావారణం అనుకూలంగా ఉండడంతో అమర్నాథ్ యాత్ర కొనసాగుతున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో యాత్రకు పర్యాటకులు తరలివస్తున్నారు. బల్తాల్, పహల్గాం మీదుగా భక్తులు అమర్నాథ్ గుహకు చేరుకుంటున్నారు. గురువారం వేలాది మంది బాబా బర్ఫానినీ దర్శించుకున్నారు.