తమిళ చిత్రం ‘అమరన్’తో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు రాజ్‌కుమార్ పెరియసామి. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా దేశభక్తి, ప్రేమ, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ప్రేక్షకుల్ని మెప్పించింది. సున్నితభావోద్వేగాలను హృద్యంగా తెరపై ఆవిష్కరించాడని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామిపై ప్రశంసలొచ్చాయి.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర నిర్మా సంస్థ టీ సిరీస్ రాజ్‌కుమార్ పెరియసామితో భారీ పాన్ ఇండియా సినిమాకు సిద్ధమవున్నది. ఈ విషయాన్ని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ప్రకటించారు. ‘అమరన్’ చిత్రంలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి స్టోరీ టెల్లింగ్, సినిమాటిక్ బ్రిలియన్స్ తమను ఎంతగానో ఇంప్రెస్ చేసిందని భూషణ్ కుమార్ అన్నారు.
టీ సిరీస్ వంటి గొప్ప సంస్థలో సినిమా ఛాన్స్ రావడం ఆనందంగా ఉందని, ‘అమరన్’ స్థాయిలోనే ఈ సినిమా కోసం మంచి కథను సిద్ధం చేస్తున్నానని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి పేర్కొన్నారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది. త్వరలో నటీనటుల వివరాలను ప్రకటించనున్నారు.