Aluu Aravind | డెకాయిట్ సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌కు తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.ఈ వేడుకకు నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, అల్లు అరవింద్, బన్నీ వాసు, స్వప్న దత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అరవింద్, హీరో అడివి శేష్‌పై ప్రశంసలు కురిపించారు. “శేష్ నిజంగానే ‘డెకాయిట్’ లాంటి వాడు. మంచి కథలను ఎంచుకుని ప్రేక్షకుల మనసులను దోచేస్తున్నాడు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు.
సినిమా గురించి మాట్లాడుతూ, “లవ్ స్టోరీని క్రైమ్ కథతో మిళితం చేస్తూ చాలా అందంగా తీశారు. నేను చూసిన సినిమాల్లో ఇది ఒక బెస్ట్ మూవీగా అనిపించింది. డైరెక్టర్ షానిల్ డియో అద్భుతంగా తెరకెక్కించారు. ఎడిటింగ్ సినిమాకు ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చింది” అని అన్నారు. ఎడిటర్ పవన్ కళ్యాణ్ పనిని కూడా ఆయన ప్రశంసించారు.ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటనపై అల్లు అరవింద్ ప్రశంసలు గుప్పించారు. “సీతారామం లో సీతగా అద్భుతంగా నటించింది. అయితే ‘డెకాయిట్’లో సరస్వతి పాత్రలో అంతకంటే మెరుగైన నటన చూపించింది. ఎమోషన్స్‌ను అద్భుతంగా పలికించింది” అని అన్నారు.
ఈ సందర్భంగా మృణాల్ వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ కావాలి అంటూ ఆమెకు ఆశీర్వాదం అందించారు. గతంలో లావణ్య త్రిపాఠికి ఇలానే ఆశీర్వదించగా, ఆమె వరుణ్ తేజ్‌ని వివాహం చేసుకున్న విషయం గుర్తుచేశారు. అల్లు అరవింద్ వ్యాఖ్యలపై మృణాల్ ఠాకూర్ సిగ్గుపడుతూ నవ్వడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఇప్పుడు మృణాల్ కూడా తెలుగింటి కోడలు అవుతుందా?” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.