‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సంపాందించుకున్న కథానాయకుడు అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పుష్ప-2 ది రూల్’. ‘పుష్ప’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీమేకర్స్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో వుంది. కాగా ఇటీవల అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన హంట్ ఫర్ పుష్ప కాన్సెప్ట్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఈ కాన్సెప్ట్ వీడియో 100 మిలియన్ పైగా వ్యూస్‌ను సాధించడంతో పాటు 3.3మిలియన్స్ లైక్స్‌తో అరుదైన రికార్డ్ సృష్టించింది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.