గంగోత్రి సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐకాన్ స్టార్‌గా మారాడు. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిన బన్నీ ఈ చిత్రంతో రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ‘పుష్ప’ కాగా, ఇందులో లారీ డ్రైవర్‌గా అలరించనున్నాడు.
పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. సమంత స్పెషల్ సాంగ్ కూడా చేయడం విశేషం. సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ బాగా వైరల్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 17న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల స్పీడ్ పెంచారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి తెలియచేశారు. సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. సుక్కు ఈ కథ చెప్పినప్పుడే ‘పుష్ప’ సినిమాలో నా క్యారెక్టర్ ఎడమ భుజం పైకి పెట్టుకుని నటించాలి అని చెప్పాడు. నేను దానికి ఓకే చెప్పాను. కానీ ‘పుష్ప’లో ఎడమ భుజం పైకి పెట్టుకుని నటించడం వల్ల ఓ వారం పాటు బాగా నొప్పిగా ఉండేది. ఆ తర్వాత అలవాటయింది.
గతంలో 2005, 2011లో నా ఎడమ భుజానికి సర్జరీలు జరిగాయి. 2011లో అయితే సర్జరీ తర్వాత కోలుకోవడానికి 11 నెలలు పట్టింది. అందుకే వాటి వల్ల ఇప్పుడు ఇలా నటిస్తుంటే భుజం బాగా నొప్పి వచ్చింది. కానీ సినిమా కోసం చేయాలి అని ఛాలెంజింగ్ గా తీసుకొని చేసాను అని తెలిపారు అల్లు అర్జున్. అలా పెట్టడం వల్ల మెడ భాగం చిన్నగా అయిపోయింది. దీంతో రోజూ లేవగానే ఓ 15 నిమిషాలు మెడను ఫుల్ స్ట్రెచ్ చేసేవాన్ని అని బన్నీ వివరించారు.