Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘రాకా’ సినిమా తర్వాత ఆయన ఎవరితో పని చేయబోతున్నారు? అన్న ప్రశ్నపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న రాకా పూర్తయ్యిన వెంటనే అల్లు అర్జున్ తన డ్రీమ్ లైనప్‌ను అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైనప్‌లో స్టార్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా ఉండటం విశేషం. అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బన్నీ-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మాత్రం వెంటనే ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
దానికి ప్రధాన కారణం ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉండడం . ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం. నీల్ తన స్టైల్ ప్రకారం ఈ రెండు భాగాలను పూర్తి చేసిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్‌ను చేపట్టే అవకాశం ఉంది. అందువల్ల అల్లు అర్జున్‌తో ఆయన సినిమా ప్రారంభం కొంత ఆలస్యం కావచ్చు. మరోవైపు అల్లు అర్జున్ షెడ్యూల్ కూడా బిజీగానే ఉంది. ప్రస్తుతం ‘రాకా’పై దృష్టి పెట్టిన ఆయన, ఆ తర్వాత వెంటనే దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న #AA23 ప్రాజెక్ట్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రూపొందనుంది. అలానే త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా బన్నీ ఓ మూవీ చేయనున్నట్టు సమాచారం.
ఇలా ఇద్దరు స్టార్స్ తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో బన్నీ-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కోసం అభిమానులు మరికొంతకాలం వేచి చూడాల్సి వస్తోంది. అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లినా, అది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక భారీ యాక్షన్ డ్రామాగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే బన్నీ చేస్తున్న రాకా ప్రాజెక్ట్ బాక్సాఫీస్‌ని షేక్ చేయడమే కాకుండా అనేక రికార్డులు సెట్ చేస్తుందని అంటున్నారు.